బెంగళూరులో బ్యాట్లెత్తేశారు భారత్ చెత్త రికార్డులు ఇవే

వర్షం కారణంగా తొలిరోజు ఆట రద్దయినా రెండోరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా భారత్, కివీస్ తొలి టెస్ట్ ఆరంభమైంది. అయితే ఈ మ్యాచ్ భారత్ ఫ్యాన్స్ కు షాకివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవ్వరూ ఊహించని విధంగా కేవలం 46 పరుగులకే భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

  • Written By:
  • Publish Date - October 17, 2024 / 09:04 PM IST

వర్షం కారణంగా తొలిరోజు ఆట రద్దయినా రెండోరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా భారత్, కివీస్ తొలి టెస్ట్ ఆరంభమైంది. అయితే ఈ మ్యాచ్ భారత్ ఫ్యాన్స్ కు షాకివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవ్వరూ ఊహించని విధంగా కేవలం 46 పరుగులకే భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. బెంగళూరు పిచ్ పై చెలరేగిపోయిన కివీస్ పేసర్ల ధాటికి మన బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. ఈ క్రమంలో పలు చెత్త రికార్డులు నమోదయ్యాయి. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఆరు వికెట్లు కోల్పోయిన ఆరో అత్యల్ప స్కోరు ఇదే. సొంతగడ్డపై రెండో అత్యల్పం. 1969లో హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ చేతిలో 27 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత స్వదేశంలో తక్కువ స్కోరుకు ఆరు వికెట్లు కోల్పోయిన మ్యాచ్ ఇదే. ఓవరాల్‌గా 2020లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా తక్కువ స్కోరుకు ఆరు వికెట్లు కోల్పోయింది.

అయితే ఈ మ్యాచ్‌లో మరో చెత్త రికార్డును టీమిండియా నమోదు చేసింది. సొంతగడ్డపై భారత టాప్-7 బ్యాటర్లలో నలుగురు డకౌటవ్వడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా ఓ ఇన్నింగ్స్‌లో టీమిండియా మొదటి ఏడుగురు బ్యాటర్లలో నలుగురు ఖాతా తెరవకుండా వెనుదిరగడం ఇది మూడోసారి. అంతకుముందు 1952, 2014లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో వికెట్లు సమర్పించుకున్నారు. ఇక కాగా.. భార‌త టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో మూడో అత్య‌ల్ప స్కోరు ఇది. గ‌తంలో అడిలైడ్ వేదిక‌గా ఆస్ట్రేలియా పై భార‌త్ 36 ప‌రుగుల‌కే ఆలౌటైంది. స్వ‌దేశంలో భార‌త్‌కు ఇదే అత్య‌ల్ప స్కోరు.

భారత గడ్డపైనే కాదు, టెస్టు చరిత్రలో ఆసియా గడ్డపై అత్యల్ప స్కోరు చేసిన అవమానాన్ని భారత్ మూటగట్టుకుంది. ఆసియా గడ్డపై భారత్ కు ఇదే అత్యల్ప స్కోరు. ఇంతకుముందు పాకిస్థాన్ తో మ్యాచ్ లో వెస్టిండీస్ కేవలం 53 పరుగులకే ఆలౌటైన రికార్డును మన టీమ్ తిరగరాసింది. ఇదిలా ఫంటే కివీస్‌ తరపున అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్‌గా మ్యాట్ హెన్రీ నిలిచాడు. ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన మ్యాట్ హెన్రీ టెస్టుల్లో అత్యంత వేగంగా వంద వికెట్లు పడగొట్టిన నాలుగో కివీస్ పేసర్ గా నిలిచాడు. హెన్రీ 26 టెస్టుల్లో సాధించగా.. రిచర్డ్ హ్యాడ్లీ , నీల్ వాగ్నర్ ముందున్నారు. ఈ మ్యాచ్ లో కివీస్ ముగ్గురు పేసర్లతోనే భారత్ ఇన్నింగ్స్ కు చెక్ పెట్టింది. సౌథీతో పాటు మ్యాట్ హెన్రీ, ఒరూర్కే కలిపి 10 వికెట్లు పడగొట్టారు.