తెలంగాణలో ఎన్నికల వేడి మరింత పుంజుకోనుంది. నేడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తన ఎన్నికల మ్యానిఫెస్టోని ప్రకటిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా గతంలో ప్రకటించిన 115 మందితో పాటూ మరో నలుగురు అభ్యర్థులను ఖరారు చేసి బీ ఫాం అందించనున్నారు. అదే క్రమంలో తమ మ్యానిఫెస్టోని కూడా విడుదల చేసి సాయంత్రం హుస్నాబాద్ భారీ బహిరంగ సభతో కేసీఆర్ తన ఎన్నికల ప్రచారానికి శంఖారావంను పూరించనున్నారు.
మ్యానిఫెస్టోను ఎలా రూపొందించారు..
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. బడుగు బలహీన వర్గాలను కలుపుకుంటూ అందరికీ సంక్షేమం అందించే విధంగా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. 2014లో తెలంగాణ ఉద్యమంలో చెప్పిన కొన్ని హామీలతో తన మ్యానిఫెస్టోని ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ప్రకటించారు. ఆతరువాత జరిగిన 2018 ముందస్తు ఎన్నికల్లో పోలింగ్ కి కేవలం మూడు రోజుల ముందు మ్యానిఫెస్టోను ప్రకటించి ఘనవిజయం సాధించింది. అయితే 2023లో మాత్రం ఎన్నికలకు దాదాపు 45 రోజుల ముందుగా మ్యానిఫెస్టో ప్రకటించి రికార్డ్ సృష్టించబోతోంది. దాదాపు నెల రోజుల పాటూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నాయకులు, ఆర్థిక, సామాజిక నిపుణులతో పాటూ కొన్ని సామాజిక వర్గాల పెద్దల అభిప్రాయాలను సేకరించి దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. దీంతో పాటూ ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న హామీల గురించి కూడా విస్తృతంగా పరిశీలించి ఈ మ్యానిఫెస్టోని రూపొందించినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఏఏ అంశాలు ఉండనున్నాయి..
- 57 ఏళ్లు దాటిన వారికి ప్రస్తుతం వస్తున్న తరుణంలో నిరుపేద మహిళలకు జీవన భృతిగా నెలనెలా రూ.3000 సాయం అందించేలా ప్రణాళికలు రచించారు. ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న మహిళలకు కాకుండా ఇతర మహిళలకు ఇది వర్తిస్తుంది.
- ప్రస్తుతం తెలంగాణలో వృద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, నేత, గీత కార్మికులు, టేకేదార్లు, కళాకారులు, బోదకాలు, డయాలసిస్ బాధితులు, హెచ్ఐవీ పేషెంట్లు అందుకుంటున్న నెలవారి పింఛన్ రూ. 2,016 ను వెయ్యి రూపాయలు పెంచి రూ. 3,016 గా మార్చనున్నారు.
- రైతు బీమా పథకం కింద రైతు ఏదైనా ప్రమాదవ శాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు వచ్చేలా పథకాన్ని రూపొందించారు. ఇప్పుడు దీనిని రాష్ట్రంలోని 90లక్షల పేద కుటుంబాలకు కూడా వర్తించేలా సరికొత్తగా తీసుకురానున్నారు. అంటే పేద కుటుంబంలో పెద్ద చనిపోతే వారికి రూ. 5 లక్షల బీమా వచ్చేలా ప్రణాళికలు రచించారు.
- దేశంలో తొలిసారి రైతులకు పెన్షన్ ఇచ్చేలా సరికొత్త మ్యానిఫెస్టో తయారు చేశారు. 57 ఏళ్లు దాటిన రెండు ఎకరాల్లోపూ వ్యవసాయ భూమి కలిగిన వారికి ఇది వర్తిస్తుంది.
- జర్నలిస్టులకు కూడా పెన్షన్ పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తోంది
- రైతులకు రైతుబంధు అనే పెట్టుబడి సాయంతో పాటూ ప్రతి సీజన్ లో ఎకరాకు రెండు బస్తాల యూరియాను ఫ్రీ గా ఇవ్వనున్నారు.
- రైతు బంధు పెట్టుబడి సాయాన్ని రెండు సీజన్లకు కలిపి ప్రస్తుతం ఎకరాకు రూ. 10వేలు ఇస్తున్నారు. దీనిని రూ. 16 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
- కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ కింద నిరుపేద కుటుంబాలకు అందించే సాయం రూ. 1,00,116 కాస్తా రూ. 1.25 లక్షలకు పెంచనున్నారు.
- కేసీఆర్ కిట్ కు సంబంధించి ప్రస్తుతం అందించే నగదు సాయం రూ. 12 వేలను రూ. 15 వేలుగా మర్చనున్నారు.
- ఆరోగ్య శ్రీ కింద చికిత్స పరిమితి గతంలో రూ. 5 లక్షలు ఉంటే.. దీనిని రూ. 10 లక్షల వరకూ పెంచనున్నారు.
- వంట గ్యాస్ సిలిండర్ కింద కేంద్రం ఇచ్చే సబ్సిడీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ. 400 ఇచ్చేలా ప్రణాళికలు సిద్దం చేశారు.
- సీనియర్ సిటిజన్లకు భరోసా పేరుతో సరికొత్త పథకాన్ని తీసుకొచ్చారు. గతంలో వీరిపై జయా బచ్చన్ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
- మహిళలు, యువతకు రూ. 2లక్షల వరకూ వడ్డీలేని రుణాలను అందించనున్నారు.
- పెట్రోలు, డీజల్ పై ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల వాటాను సవరించే ఆలోచన చేస్తున్నారు.
- ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు అందించే పూర్తి స్థాయి బోధనా చెల్లింపులను బీసీలకు కూడా వర్తించేలా మ్యానిఫెస్టోని విడుదల చేయనున్నారు.
వీటన్నింటితో పాటూ మరో 30కి పైగా సరికొత్త పథకాలను ప్రకటించి, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, నైపుణ్య శిక్షణా తరగతులు నిర్వహించి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందించేలా సరికొత్త మ్యానిఫెస్టోని ప్రకటించనున్నారు. మహిళలు, రైతులు, యువత, పేదలతో పాటూ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని దీనిని తయారు చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని హామీలు తెలియాలంటే మ్యానిఫెస్టో ప్రకటించే వరకూ వేచి చూడాలి.
T.V.SRIKAR