దాదాపు 9 గంటల ప్రయాణం తరువాత చంద్రబాబును విజయవాడలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు సీఐడీ అధికారులు. ఉదయం ఎలాంటి ఆధారాలు చూపకుండా బాబును అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఇప్పుడు సిట్ ముందు తాము సేకరించిన ఆధారాలను సమర్పించే ఛాన్స్ ఉంది. ఈ కేసులో ముఖ్యంగా 10 ప్రశ్నలను చంద్రబాబు ఎదుర్కోబోతున్నట్టుగా తెలుస్తోంది.
- 2014లో తీసుకువచ్చిన ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్‌కు రూపకల్పన చేసింది ఎవరు ?
- స్కాం చేసే ఉద్దేశంతోనే స్కీం తయారు చేశారా ?
- స్కీం వివరాలు జీవోలో ఒకలాగా ఎంవోయూలో మరోలా ఎందుకూ రూపొందించారు, దీని వెనక ఉన్నది ఎవరు ?
- స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్లో క్లస్టర్స్ ప్రారంభించకుండానే ఎందుకు ఎంవోయూ చేసుకున్నారు, అంత అవసరం ఏమొచ్చింది ?
- సీమన్ కంపెనీ తన 90 శాతం వాటా చెల్లించకుండా ప్రభుత్వం తన 10 శాతం వాటా 371 కోట్లు ఎందుకు విడుదల చేసింది ?
- సీనియర్ అధికారులు వద్దు అన్నా ఎందుకు నిధులు విడుదల చేయించారు ?
- 371 కోట్లలో 241 కోట్లు ఎలా తప్పుదారి పట్టాయి ?
- షెల్ కంపెనీలు ఆ డబ్బును చివరగా ఎవరికి చేర్చాయి ?
- ఈ కంపెనీలు షెల్ కంపెనీలని ముందే తెలుసా ?
- టీడీపీ ప్రభుత్వంలోనే ఈ తప్పు జరిగినా ఎందుకు బయటికి రానివ్వలేదు ?
ముఖ్యంగా ఇవే ప్రశ్నలు ఇప్పుడు చంద్రబాబును సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నట్టు సమాచారం. ఈ ప్రశ్నల చుట్టే కేసుకు సంబంధించిన అన్ని వివరాలు అల్లుకుని ఉన్నాయి. వీటి నుంచి బాబు ఇచ్చే వివరణ ఆధారంగానే అధికారులు తరువాతి చర్యలు తీసుకోబోతున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నలకు చంద్రబాబు ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అనేది సస్పెన్స్‌గా మారింది.