TDP In Telangana: తెలంగాణ ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న టీడీపీ.. కారణాలు ఇవే

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. తాము తెలంగాణ ఎన్నికల బరిలో నిలబడబోమని స్పష్టం చేసింది. గతంలో అభ్యర్థులు పోటీకి సిద్దంగా ఉన్నారని తెలిపినప్పటకీ చంద్రబాబు మాటకు కట్టుబడి పోటీనుంచి తప్పుకున్నట్లు తెలిపారు కాసాని.

  • Written By:
  • Updated On - October 29, 2023 / 11:59 AM IST

తెలంగాణలో రాజకీయం మంచి జోరుమీద ఉంది. బీఆర్ఎస్ ఎన్నికల్ ప్రచారంలో దూకుడు కొసాగిస్తోంది. కాంగ్రెస్ ప్రచారంతో పాటూ అభ్యర్థులను క్రమక్రమంగా ప్రకటిస్తూ వస్తోంది. ఇప్పటికే 100 స్థానాలకు ఎమ్మెల్యే క్యాండిడేట్లను ప్రకటించింది. బీజేపీ కూడా మొదటి లిస్ట్ అనౌన్స్ చేసి జనసేనతో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్దమైంది. అయితే ఈ పరిణామాలన్నీ ఒక ఎత్తైతే.. టీడీపీ బరిలో దిగడం లేదని కుండబద్దలు కొట్టింది. మన్నటి వరకూ 89 స్థానాల్లో అభ్యర్థులు సిద్దంగా ఉన్నారని పోటీ చేస్తామని తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు.

కారణాలు ఇవే..

శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఈ భేటీలో టీడీపీ అధినేత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. ఏపీలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో పోటీ చేయలేకపోతున్నామన్న విషయాన్ని పార్టీ నేతలకు వివరించాలని చంద్రబాబు చెప్పినట్లు కాసాని తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్దమైన నేతలకు వివరిస్తున్నారు. అయితే గతంలో బాలకృష్ణను తెలంగాణ ఎన్నికలను చూసుకోమని చెప్పినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించలేదు. పైగా బాలయ్య వరుస సినిమా ఫంక్షన్లు, ప్రీ రిలీజ్, విజయోత్సవాలలో బిజీ అయిపోయారు. లోకేష్ చంద్రబాబు బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలో లీగల్ టీంతో తలమునకలయ్యారు. నారా భువనేశ్వరి కూడా నిజం గెలవాలి యాత్రలో నిమఘ్నమయ్యారు. మరో వారం రోజుల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న తరుణంలో అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో టీడీపీ అధినేత అందుబాటులో లేరు.  పార్టీలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు ఇలా కీలక నేతలు లేకపోవడంతో పోటీ నుంచి తప్పుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

T.V.SRIKAR