Israel War: వెతికి మరీ చంపుతున్నారు.. ఇజ్రాయెల్‌లో మరణమృదంగం..

మనుషులా రాక్షసులా అన్న స్థాయిలో మిలిటెంట్లు అమాయకులపై దాడులు చేస్తున్నారు. మిలిటెంట్ల దాడిలో తన అల్లుడుని కోల్పోయిన ఓ వ్యక్తి హాస్పిటల్‌ ముందు ఏడుస్తూ కూర్చున్న దృశ్యాలు ప్రతీ ఒక్కరి హృదయాన్ని ద్రవింపజేశాయి.

  • Written By:
  • Publish Date - October 10, 2023 / 12:51 PM IST

గాజా సరిహద్దులోని ఓ అందమైన ప్రాంతంలో జరుగుతున్న మ్యూజిక్‌ ఫెస్ట్‌ అది. పాటలు వినేందుకు వచ్చిన సంగీత ప్రియులు, స్నేహితులతో వచ్చిన యువతీ యువకులు, జీవిత భాగస్వాముతో వచ్చిన పర్యాటకులు, గెస్ట్‌లకు సేవలందిస్తున్న హోటల్‌ సిబ్బంది. ప్రపంచాన్ని మర్చిపోయి సంగీతాన్ని ఎంజాయ్‌ చేస్తున్న టైంలో అనుకోని ఉపద్రవం ఆ ప్రాంతాన్ని చుట్టేసింది. యుద్ధ మేఘాలు ఆ మ్యూజిక్‌ ఫెస్ట్‌ను కమ్మేశాయి. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే రాకెట్ల వర్షం కురిసింది. భయంతో ముందుకు పరిగెత్తినకొద్దీ శవాల గుట్టలు కనిపిస్తున్నాయే తప్ప.. ప్రాణాన్ని కాపాడుకోగలమనే నమ్మకం మాత్రం ఎవరికీ కలగడంలేదు. నెత్తురోడిన ఆ రోడ్డును చూసి ప్రతీ ఒక్కరి వెన్నులో వణుకు పుట్టింది. రాకెట్ల దాడిలో ఒకే చోట 260 మంది చనిపోయారు. ఇది కేవలం మ్యూజిక్‌ ఫెస్ట్‌ దగ్గర సీన్‌ మాత్రమే.

ఇక ఇజ్రాయెల్‌ దేశం మొత్తం దాదాపుగా ఇదే సీన్‌ కనిపిస్తోంది. ఇళ్లు, ఆస్థులు, స్నేహితులు, బంధువులు కాదు.. జస్ట్‌ బతికుంటే చాలు అని చాలా మంది ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెడుతున్నారు. మనుషులా రాక్షసులా అన్న స్థాయిలో మిలిటెంట్లు అమాయకులపై దాడులు చేస్తున్నారు. మిలిటెంట్ల దాడిలో తన అల్లుడుని కోల్పోయిన ఓ వ్యక్తి హాస్పిటల్‌ ముందు ఏడుస్తూ కూర్చున్న దృశ్యాలు ప్రతీ ఒక్కరి హృదయాన్ని ద్రవింపజేశాయి. తన కుటుంబాన్ని వదిలేయండి కావాలంటే నేను మీతో వచ్చేస్తాను అని మిలిటెంట్లతో ఓ వ్యక్తి పెట్టుకున్న అభ్యర్థన ప్రతీ ఒక్కరి కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది.

ఇక మ్యూజిక్‌ ఫెస్ట్‌కు వచ్చి ఓ అమ్మాయిని మిలిటెంట్లు కిడ్నాప్‌ చేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నన్ను చంపొద్దు.. కాపాడండీ అంటూ ఆ యువతి అరిచిన అరుపులు ప్రతీ ఒక్కరి నెత్తురు మరిగేలా చేస్తోంది. చిన్నా పెద్దా తేడా లేదు.. ముసలి ముతక అవసరం లేదు. కంటికి కనిపిస్తే కాటికి పంపేస్తున్నారు. ఇది ఇప్పుడు ఇజ్రాయెల్‌ – పాలస్తీనా సరిహద్దుల్లో పరిస్థితి. ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకూ 9 వందల మంది చనిపోయారు, 2 వేల 2 వందల 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాలస్తీనాలో 6 వందల 80 మంది చినిపోయారు. 3 వేల 7 వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. మృతుల సంఖ్య నిమిషనిమిషానికి పెరుగుతూనే ఉంది. వందల కొద్దీ రాకెట్లు వేల కొద్దీ సైనికులు. వీళ్లిద్దరి మధ్య యుద్ధంలో ప్రాణాలు కోల్పోతోంది మాత్రం బోర్డర్‌ ఏరియాల్లో ఉన్న అమాయక ప్రజలు. ఈ మృత్యుఘోషను ఆపేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది.