ఐపీఎల్ మెగావేలం కోసం ఫ్రాంచైజీలు కసరత్తు పూర్తయినట్టే కనిపిస్తోంది. గత సీజన్ లో రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ నిబంధనలకు అనుగుణంగా పలువురు స్టార్ ప్లేయర్స్ ను వదిలేయక తప్పడం లేదు. సన్ రైజర్స్ వదిలేసే ప్లేయర్స్ లో మయాంక్ అగర్వాల్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. గత సీజన్ లో మయాంక్ పూర్తిగా విఫలమయ్యాడు. 2019 నుంచి వరుసగా మూడు సీజన్లు దుమ్మురేపిన మయాంక్ అగర్వాల్ ఆ తర్వాత ప్రతీ సీజన్ లో నిరాశపరిచాడు. దీంతో అతన్ని వేలంలోకి వదిలేయనుందని సమాచారం. అలాగే పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కు కూడా సన్ రైజర్స్ గుడ్ బై చెప్పడం ఖాయమే. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఉమ్రాన్ మాలిక్ దేశవాళీ క్రికెట్ లో అత్యంత వేగంతో బౌలింగ్ చేసే పేసర్ గా రికార్డులెక్కాడు. ఈ వేగంతోనే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఉమ్రాన్ 2022 సీజన్ లో అదరగొట్టాడు. అద్భుతమైన బౌలింగ్ తో 22 వికెట్లు పడగొట్టాడు. తర్వాత వేగం తప్పితే బౌలింగ్ లో వైవిధ్యం లేకపోవడంతో తేలిపోయాడు. దీనికి తోడు గాయాలతో వరుసగా మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫ్రాంచైజీ అతన్ని కూడా విడిచిపెట్టనుంది.
ఇక గత సీజన్ లో సన్ రైజర్స్ ను నడిపించిన పాట్ కమ్మిన్స్ ను కూడా వేలంలోకి విడిచిపెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. రికార్డు స్థాయిలో ఏకంగా 20.5 కోట్లు పెట్టి కమ్మిన్స్ ను కొనుగోలు చేసింది. సారథిగా ఆకట్టుకున్న కమ్మిన్స్ బౌలింగ్ లోనూ పర్వాలేదనిపించాడు. అయితే ఈ సారి ఆ ధరకు అతన్ని వదిలేసి తక్కువ బిడ్ తో దక్కించుకునే ప్లాన్ కనిపిస్తోంది. దీంతో కమ్మిన్స్ ను కూడా వేలంలోకి వదిలేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.