టెస్ట్ ఫార్మాట్ అంటే ఏ క్రికెటర్ కైనా ఛాలెంజ్ లాంటిదే.. ఎందుకంటే సంప్రదాయ ఫార్మాట్ తోనే ఏ ఆటగాడి సత్తా బయటపడుతుంది.. వన్డే, టీ ట్వంటీ తరహాలో మెరుపులు మెరిపించి వెళ్ళిపోదామంటే కుదరదు… టెస్ట్ క్రికెట్ లో రాణించాలంటే ఎంతో ఓపిక ఉండాలి.. ముఖ్యంగా బ్యాటర్లు సుధీర్ఘ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది… ప్రత్యర్థి బౌలర్లు ఎంత ఇబ్బంది పెట్టినా క్రీజులో సహనంతో నిలదొక్కుకుంటేనే లాంగ్ ఇన్నింగ్స్ లు ఆడగలుగుతారు. ఈ విషయం మరోసారి పెర్త్ టెస్టుతో రుజువైంది. బౌలర్ల హవా కొనసాగుతున్న పెర్త్ పిచ్ పై రెండో ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్లు సత్తా చాటారు. ఓపిగ్గా ఆడి నిలదొక్కుకున్నారు. జైశ్వాల్, రాహుల్ ఇద్దరూ ఎంతో సహనంతో బ్యాటింగ్ చేసిన ఫలితమే భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఈ క్రమంలో టీమిండియా ఓపెనర్లు చరిత్ర సృష్టించారు. 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసీస్ గడ్డపై 150 ప్లస్ పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. చివరిసారిగా 2004లో సిడ్నీ వేదికగా జరిగిన టెస్ట్‌లో వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా 123 పరుగుల ఓపెనింగ్ పార్టనర్ షిప్ నెలకొల్పగా… ఆ తర్వాత మళ్లీ ఏ భారత ఓపెనింగ్ జోడీ ఈ ఘనతను అందుకోలేదు.
ఈ జాబితాలో సునీల్ గవాస్కర్, క్రిష్ శ్రీకాంత్ 191 పరుగుల భాగస్వామ్యంతో అగ్రస్థానంలో ఉన్నారు. 1986లో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఈ దిగ్గజ ఓపెనింగ్ జోడీ ఈ ఫీట్ సాధించింది.. ఆ తర్వాత చౌహన్, సునీల్ గవాస్కర్ 165 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు. 1981లో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టెస్ట్ మూడో ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించారు. ఇక 2003లో ఆకాశ్ చోప్రా వీరేంద్ర సెహ్వాగ్ .. మెల్‌బోర్న్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 141 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 2004లో సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా 123 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నారు.
అయితే జైస్వాల్, కేఎల్ రాహుల్ పాత రికార్డులను అధిగమించేసి ఇప్పుడు గవాస్కర్, శ్రీకాంత్ పార్టనర్ షిప్ రికార్డుపై కన్నేశారు. ఆ మైలురాయికి జైశ్వాల్, రాహుల్ జోడీ మరో 20 పరుగుల దూరంలో నిలిచింది. మూడోరోజు ఆటలో ఈ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశముంది. అటు పెర్త్ టెస్టులో భారత్ పూర్తిగా పట్టుబిగించింది. ఆసీస్ ను 104 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా ఇప్పుడు భారీ ఆధిక్యంపై కన్నేసింది. రెండో ఇన్నింగ్స్ లో జైశ్వాల్, రాహుల్ జోరుతో ఆటముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 172 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.