ఇలా అయితే కష్టమే నిరాశపరుస్తున్న సిరాజ్

గత కొన్నేళ్ళుగా భారత క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తోందంటే దానికి కారణం మన పేస్ ఎటాక్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. స్టార్ పేసర్ బూమ్రా, సీనియర్ పేసర్ మహ్మద్ షమీతో పాటు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్, ఇంకా పలువురు యువ పేసర్లతో మన పేస్ బలం పదునెక్కింది.

  • Written By:
  • Publish Date - October 23, 2024 / 11:10 AM IST

గత కొన్నేళ్ళుగా భారత క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తోందంటే దానికి కారణం మన పేస్ ఎటాక్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. స్టార్ పేసర్ బూమ్రా, సీనియర్ పేసర్ మహ్మద్ షమీతో పాటు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్, ఇంకా పలువురు యువ పేసర్లతో మన పేస్ బలం పదునెక్కింది. ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని వరుసగా రెండుసార్లు గెలిచిందంటే ఈ పేస్ బౌలింగే కారణం. అయితే ఈ పేస్ ఎటాక్ లో ప్రధాన బౌలర్ గా మారిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ గత కొంతకాలంగా ఆందోళన కలిగిస్తోంది. సిరాజ్ పేస్ పదును తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల బంగ్లాదేశ్ తో సిరీస్ లోనూ, కివీస్ తో తొలి టెస్టులోనూ సిరాజ్ ప్రదర్శన స్థాయికి తగినట్టు లేదు. బెంగళూరు పిచ్ పై కివీస్ పేసర్లు సత్తా చాటిన వేళ సిరాజ్ తన బౌలింగ్ తో ఆకట్టుకోలేకపోవడం ఆశ్చర్యపరిచింది.

అతని బౌలింగ్ లో వైవిధ్యం కనిపించడం లేదన్న విశ్లేషణా మొదలైంది. గత రెండేళ్ళూ విదేశీ పిచ్ లపై చెలరేగిపోయిన సిరాజ్ సొంతగడ్డపై మాత్రం తేలిపోతున్నాడు. విదేశాల్లో 17 టెస్టుల్లో 61 వికెట్లు పడగొట్టిన ఈ హైదరాబాదీ పేసర్ స్వదేశంలో మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాడు. స్వదేశంలో 13 టెస్టుల్లో కేవలం 19 వికెట్లకే పరిమితమయ్యాడు. టెస్టుల్లో ఇది సిరాజ్ స్థాయికి తగినట్టుగా లేదన్నది అందరికీ అర్థమవుతోంది. బూమ్రా తరహాలో ఇన్నింగ్స్ ఆరంభంలో వికెట్లు తీయలేకపోతున్నాడు. వేరియేషన్ కూడా చూపించలేకపోతుండడంతో పరుగులూ సమర్పించుకుంటున్నాడు. ఇప్పుడు పుణేలో న్యూజిలాండ్ తో జరగబోయే రెండో టెస్టుకు తుది జట్టులో సిరాజ్ ఉండడం అనుమానంగానే ఉంది.

పూర్తి స్పిన్ వ్యూహంతోనే బరిలోకి దిగితే మాత్రం సిరాజ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వస్తాడు. ఒకవేళ మరో పేసర్ కావాలనుకుంటే సిరాజ్ పైనే వేటు పడడం ఖాయం. అతని స్థానంలో ఆకాశ్ దీప్ జట్టులోకి వస్తాడని అంచనా వేస్తున్నారు. పిచ్ పరిస్థితిని బట్టి లైన్ అండ్ లెంగ్త్ మార్పు చేసుకోకుండా బౌలింగ్ చేయడమే సిరాజ్ వైఫల్యానికి కారణంగా కనిపిస్తోందని పలువురు మాజీ బౌలర్లు అభిప్రాయపడుతున్నారు. విదేశీ పిచ్ లతో పోలిస్తే మన పిచ్ లపై బౌన్స్ తక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో లైన్ అండ్ లెంగ్త్ కూడా మార్చుకోవాల్సిి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. కివీస్ తో సిరీస్ లో సిరాజ్ ఫామ్ అందుకోకుంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్ కు టెన్షనే. అసలే జట్టులో ప్రతీ ప్లేస్ కూ కనీసం ముగ్గురు పోటీ పడుతుండడంతో లైన్ అండ్ లెంగ్త్ అందిపుచ్చుకోవడం సిరాజ్ కెరీర్ కే కీలకమని చెప్పొచ్చు.