మగధీరలో విలన్ డైలాగ్ ఒకటి ఉంటుంది.. ‘నాకు దక్కనిది ఇతరులకు దక్క కూడదు’ అని. ఆ డైలాగ్ బీజేపీ నాయకులను చూసే రాసి ఉంటారు. ఆ విలన్ క్యారెక్టర్ కూడా కాషాయ పార్టీ నేతలకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించినా అధికారంలోకి రాలేకపోయిన బీజేపీ.. అప్పటి నుంచి చేయని నీచ రాజకీయమంటూ లేదు. ఎన్నికల్లో శివసేన-బీజేపీ కలిసే పోటి చేసినా.. సీఎం కుర్చి విషయంలో రెండు పార్టీల మధ్య మొదలైన రచ్చ.. హిందుత్వ పార్టీగా ముద్రపడ్డ ఉద్ధవ్ సేనను ఏకంగా సెక్యూలర్ పార్టీలగా చెప్పుకునే ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసేలా చేశాయి. అప్పటి నుంచి ఈ నిమిషం వరకు శివసేన, ఎన్సీపీని చీల్చే పనిలో బీజేపీ పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడుతుంది. తాజాగా ఎన్సీపీకి అజిత్ పవర్ రెబల్‌గా మారడంతో కాషాయ కష్టానికి ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి.. కానీ ఎందుకీ దిగజారుడుతనం..? మరో ఏడాది ఆగితే ఎన్నికలు వస్తాయి కదా..!
బీజేపీ బుద్ధి ఎప్పటికీ అంతే..
2019లో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన మహావికాస్ ఆఘాడీ కూటమిగా ఏర్పడి మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేశారు. అప్పటినుంచి సరైన సమయం కోసం గోతి కాడ నక్కలా ఎదురుచూసిన బీజేపీ.. శివసేన ఎమ్మెల్యేల్లో ఒకరైన ఏక్‌నాథ్ షిండేని తిరుగుబాటు ఎగరేసేలా చేసింది. 40మంది ఎమ్మెల్యేల మద్దతులో పాటు బీజేపీ సపోర్ట్‌తో సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేశారు. ఇక్కడితో బీజేపీ సరిపెట్టుకోలేదు. శివసేన ఒక్కదాన్ని చీల్చితే సరిపోదు.. ఎన్సీపీని కూడా చీల్చాలి కదా..! లేకపోతే హైకమాండ్‌లోని అపర చాణిక్యుడికి నిద్రపట్టదు.. అసలే అయ్యగారికి మహా ఛాదస్తాం కదా..!
అస్త్రం @ అజిత్ పవర్:
నిజానికి అజిత్ పవర్ ఇలా తన పార్టీని దిక్కరించి బీజేపీ గూటికి చేరడం ఇది తొలిసారి కాదు. 2019లోనే బీజేపీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా.. ఎమ్మెల్యేల బలం లేకపోయినా.. ఫడ్నవీస్‌ని సీఎంగా, అజిత్ పవర్‌ని డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయించింది. అయితే తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన ఝలక్‌తో ఇద్దరు దిగిపోయారు. అజిత్ పవర్‌ని కూడా ఎన్సీపీ క్షమించేసింది. ఏదో తొందరపడ్డాడులే అని సర్ధి చెప్పుకుంది. అయితే అజిత్ పవర్ మాత్రం లోలోపలే అదే కన్నింగ్ బుద్ధిని ఉంచుకున్నాడని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఇటివలే ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవర్ రాజీనామా చేశాడు.. తన కూతురు సుప్రీయ సులేకి ఈ బాధ్యతలు అప్పగించారు. తన బాబాయ్ శరద్ పవర్ చేసిన ఈ పని అజిత్ పవర్‌కి నచ్చలేదో.. లేకపోతే ఎప్పటినుంచో నటిస్తూ వస్తున్నాడో తెలియదు కానీ.. 30మంది ఎమ్మెల్యేలను తన వెంట పెట్టుకోని రాజ్‌భవన్‌కి వెళ్లడం..డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం చకాచకా జరిగిపోయాయి.
ఇదంతా బీజేపీ వెనకి నుంచి ఆడిస్తున్న నాటకమేనని చిన్నపిల్లాడిని అడిగిన చెబుతాడు. పార్టీలను చీల్చుతూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న బీజేపీ తానేదో గొప్ప పని చేసినట్టు డబ్బా కొట్టుకోవడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం. వచ్చే ఏడాదే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. అప్పటివరకు కూడా ఆగలేదు. పార్టీలను చీల్చాలన్న తమ టార్గెట్‌ని బీజేపీ సాధించుకుంది. ఇదేమీ గొప్ప పని కాదు.. చాణిక్య నీతి అంతకన్నా కాదు..ఈ నక్క బుద్ధి తెలివితేటలు ఎక్కువ కాలం సాగలేవు. కేంద్ర హోంమంత్రిగా దేశ రాజకీయాలను శాసిస్తున్న అమిత్‌షా ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది..!