ప్రశాంత్ కిషోర్. ఎన్నికల వ్యూహకర్త. అన్నిటికన్నా మించి బతక నేర్చిన వాడు. ఏ రోటి కాడ ఆ పాట పాడి… పబ్బం గడుపుకునేవాడు. బీజేపీకి ఎన్నికల వ్యూహకర్తగా సక్సెస్ అయి అక్కడి నుంచి వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వచ్చి జగన్ని తానే గెలిపించాననీ… తన వల్లే 151 సీట్లు జగన్ కి వచ్చాయని ప్రచారం చేసుకున్న ఘనాపాటి. ఏ పార్టీ గెలుస్తుందో చూసి ఆ పార్టీకి స్ట్రాటజిస్ట్ గా పనిచేసి… ఆ గెలుపును తన అకౌంట్లో వేసుకోవడం ప్రశాంత్ కిషోర్ నిత్యం చేసే పని. ఓడిపోయే పార్టీని తన వ్యూహాలతో గెలిపించిన ఘనత ఈ బిహారీ చరిత్రలోనే లేదు. నానాటికి దిగజారి పోతున్న కాంగ్రెస్ పార్టీలో పాగా వేసి ఆ పార్టీకి ఏకంగా జనరల్ సెక్రెటరీ లేదా వైస్ ప్రెసిడెంట్ అవుదామని అనుకొని… అక్కడ నుంచి తిన్నగా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అయిపోదామని మాస్టర్ ప్లాన్ వేశాడు బిహారీ ప్రశాంత్ కిషోర్.
అదేమైనా అల్లాటప్ప ప్రాంతీయ పార్టీనా…? కాంగ్రెస్ పార్టీ. ఓడిపోయి పాతికేళ్ళు అపోజిషన్ లోనైనా ఉంటారు కానీ… గాంధీ టైటిల్ని వదిలేసి వేరే వాడికి పార్టీ అప్పచెప్తారా? పీకేకి దండం పెట్టి దయచేయమని చెప్పారు. అంత డేంజర్ పీకే 2019లో జగన్ ఎలా గెలవాలో రకరకాల పాఠాల ద్వారా ట్రైనింగ్ ఇచ్చాడు. అంతేకాదు ఏపీని ఎలా పాలించాలో… పాతికేళ్లు అధికారంలో ఎలా ఉండాలో అందుకు ఎన్నో వ్యూహాల్ని… పథకాల నీ జగన్ కి చెప్పింది ఈ మహానుభావుడే. ఆంధ్రప్రదేశ్లో ప్రతి వాడికి కులగజ్జి ఎక్కువని కులం అంటే పడి చస్తారని… అందుకే ఏపీ వాళ్ళని కులంతో కొట్టాలని… కులాలు లెక్కన విడగొట్టాలని పనికిమాలిన ఫార్ములా చెప్పింది ప్రశాంత్ కిషోర్. పీకే ఫార్ములా చెప్తే దాన్లో పీహెచ్డీ చేశాడు జగన్. ఈ ఐదేళ్లు కులాల మీదే ఆ రాష్ట్రాన్ని నడిపించాడు. 54 బీసీ కమిషన్లు పెట్టి దానికి చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమించి ఎక్కడికక్కడో చీలికలు తెచ్చాడు. పాస్టర్లకి నెలవారి జీతాలు ఇచ్చాడు. కాపు కమిషన్ ద్వారా కాపులను ఆదుకుంటానన్నాడు. అర్చకులకు జీతాలు అన్నాడు. కమ్మవాళ్ళు అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని ఆరోపించాడు. ఏదైతేనేం ఏపీలో కులాల కుమ్ములాటలను ఒక రేంజికి తీసుకెళ్లాడు జగన్.
ప్రశాంత్ కిషోర్ సలహాలు మీదనే జనానికి డబ్బులు పంచడం, రకరకాల పథకాలతో అన్ని వర్గాలను డబ్బులు ఇచ్చి ఆకట్టుకోగలిగాడు. జగన్ కు ఇన్ని విద్యలు… ఇన్ని సూత్రాలు నేర్పిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అడ్డంగా ప్లేట్ తిప్పేశాడు. ఏపీలో వైసీపీ నానాటికి పడిపోవడం తో టిడిపి గెలుపుని ముందే ఊహించి ఇప్పుడొచ్చి చంద్రబాబుతో పులిహార కలపడం మొదలుపెట్టాడు. ఢిల్లీలో లోకేష్ తో రహస్య భేటీ, ఆ తర్వాత బాబుతో భేటీ, ఈమధ్య హైదరాబాదులో మరో నాలుగు గంటలు చంద్రబాబుతో రహస్య సమావేశం. ఇవన్నీ పూర్తయ్యాక ఇప్పుడు ఏం చేసినా జగన్ గెలవడం అసాధ్యమని… 40 ఎమ్మెల్యే సీట్లకు మించి జగన్ కు రావని జోస్యం చెప్తున్నాడు ప్రశాంత్ కిషోర్. పీకే చెప్పేది జరగొచ్చు జరగకపోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్.. అస్తవ్యస్తంగా అయిపోవడానికి మాత్రం పీకేనే ప్రధాన కారణం.
2019లో ఏపీలో గెలవగానే జగన్ మొట్టమొదట ఆనందంతో కౌగిలించుకున్నది ప్రశాంత్ కిషోర్ నే. అదే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు… జగన్ ఓడిపోవడం ఖాయమని జాతకం చెప్తున్నాడు. ఒకప్పుడు తన వల్లే జగన్ గెలిచాడని 400 కోట్లు రూపాయలు ఫీజుగా వసూలు చేసిన పీకే… ఇప్పుడు రాబోయే పరిస్థితులు ముందుగానే ఊహించి తెలివిగా చంద్రబాబు వైపు చేరి… ఏపీలో మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. ఏపీలో జనాన్ని కులాలతో విడగొట్టమని, ఫ్రీగా పథకాలు ఇమ్మని జగన్ కు ప్రబోధించింది ప్రశాంత్ కిషోరే. పీకే చెప్పిన ఫార్ములాలని గుడ్డిగా అనుసరిస్తూ తనకి తిరుగులేదనుకున్నాడు జగన్. చివరికి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ జగన్ ఓడిపోతున్నాడని, 40 సీట్లకు మించి ఏపీలో రావని చెప్తూ ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని సృష్టిస్తున్నాడు. పెయిడ్ వ్యూహకర్తలు ఎలా ఉంటారో… అవసరానికి తగినట్లు ఎలాగా ఊసరవెల్లిలా రూపాలు మారుస్తారో ఏపీ జనానికి పీకేని చూసిన తర్వాత అర్థమవుతుంది.