ఓటరన్నా.. సిగ్గుందా..
బాహుబలి సినిమా టికెట్ల కోసం బారులు తీరారు.. ఐపీఎల్ టికెట్ల కోసం లాఠీ దెబ్బలు తిన్నారు.. పబ్బులు, క్లబ్బులు అంటే క్యూ లైన్‌లో గంటలకు గంటలు వెయిట్ చేసీ మరీ గబ్బు గబ్బు చేసే ఓటరన్నా.. భవిష్యత్‌ను, బతుకును డిసైడ్ చేసే ఓటుకు కనిపించలేదు ఎందుకన్నా ! ఓటేయకుండా ఎక్కడికి పోయావన్నా.. ఓట్ల పండగ హాలీడేలా అనిపించిందా.. సిగ్గుందా సార్ మీకు ! మూడు రోజులు సెలవొచ్చిందని ఇంట్లో తొంగున్నావా.. ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిపుల్లేశావా.. ఇదీ హైదరాబాద్ ఓటర్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. రాజకీయాల గురించి పేజీలకు పేజీలు సోషల్ మీడియాలో రాస్తూ.. బడ్డీ కొట్ల దగ్గర గంటలకు గంటలకు సొల్లు పెడుతూ.. వాడొస్తే బాగుంటుంది.. వీడుంటే బాగుంటుందని ఉచిత సలహాలు ఇస్తూ.. చివరికి పోలింగ్ రోజూ కనిపించకుండా పోయాడు హైదరాబాద్ ఓటర్.
ఎన్నికలు అంటే చాలు.. ఎక్కడలేని మాయరోగం వస్తుంది హైదరాబాద్ ఓటర్‌కు! ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే కనిపించింది. మళ్లీ అదే బద్ధకం.. అదే నిర్లక్ష్యం.. ఎన్నికలేవైనా అదే పద్ధతి. ఓటేయాలనే ఉత్సాహం లేదు. సెలవు దొరికిందని మన్నుతిన్న పాములా ఇంటికి పరిమితం కావటం.. సినిమాలు, షికార్లు అంటూ టైం పాస్ చేయడం.. లాంగ్ వీకెండ్ అంటూ అంటూ టూర్లు వేయడం.. ఇవి తప్ప ఓటేసే ఉత్సాహం మాత్రం సిటీ పౌరుడు చూపటం లేదు.. ఓ మాల్ ఓపెన్ అయితే.. పోటెత్తుతారు.. సన్‌బర్న్‌లాంటి షో జరిగితే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని అరగంట ముందే వెళ్తారు. పబ్బులు, క్లబ్బుల్లో గడపటానికి నిద్ర త్యాగం చేస్తారు. ఐపీఎస్ మ్యాచ్ అంటే అత్యంత నిష్ఠగా టీవీలకు అతుక్కుపోతారు. ఓటేయటానికి రండ్రా బాబు అంటే మాత్రం ఒక్కరూ వినిపించుకోరు. అదేదో తమకు సంబంధం లేని విషయంలా ఫేస్ పెడతారు. అన్నింట్లో ముందుండే నగరవాసులు… ఓటు విషయంలో మాత్రం అడ్రస్ లేకుండా పోతున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ పాలసీలపై తెగ చర్చలు చేస్తారు.
అంతర్జాతీయ పాలిటిక్స్ నుంచి అంతరిక్షం వరకు.. ఆర్థిక విధానాల నుంచి సంక్షేమ పథకాల వరకు.. అన్నింటిపై ఆసక్తి చూపే సిటీ జనం… ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాల్సిన ప్రక్రియకి మాత్రం దూరంగా ఉండిపోతున్నారు. ప్రతి ఎన్నికలో ఇదే సీన్. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయింది. హైదరాబాద్‌లో కోటిమందికి పైగా ఓటర్లున్నారు.. ఏ ఎన్నిక జరిగినా నూటికి నలభై యాభై మంది కంటే ఓటేసేవాళ్లు కనిపించటం లేదు. ఏ సదుపాయాలు లేని, ఆధునికత అంటని, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు తెలియని జనం బాధ్యతతో వ్యవహరిస్తుంటే… అన్నీ తెలుసని చెప్పుకునే హైదరాబాదీ జనం మాత్రం ఓటుకి ఆమడ దూరంలో ఉండిపోతున్నారు. గ్రామాల్లో చాలాచోట్ల మండుటెండల్లో ఓటేయడానికి ఓపిగ్గా క్యూలో నిలబడ్డ దృశ్యాలు కనిపిస్తే..నగరాల్లో మాత్రం పోలింగ్ బూత్‌లు ఖాళీగా దర్శనం ఇచ్చాయ్. ఏ ఎన్నిక అయినా తెలంగాణ జిల్లాల్లో 75 నుంచి 85శాతం పోలింగ్ నమోదవుతుంటే… హైదరాబాద్‌లో 40శాతం దాటడం గగనం అయిపోతోంది.
నగరవాసులకు పోలింగ్ డే అంటే హాలీడే అంతే ! ఓటర్ ఐడీ అంటే అదో అడ్రస్ ఫ్రూఫ్ అంతే! ఓటర్ ఐడీ అంటే.. బండి కొనుక్కోడానికి, లోన్లు పెట్టుకోడానికి, క్రెడిట్ కార్డులకు, సిమ్ కార్డ్ తీసుకోడానికి పనికొచ్చే ఓ అడ్రస్ ప్రూఫ్ మాత్రమే. దేశ పౌరుడిగా తన బాధ్యతను నెరవేర్చడానికి ప్రభుత్వమిచ్చిన ఆయుధం అని ఎవరూ అనుకోవడం లేదు. గ్రేటర్ పరిధిలోని లోక్ సభ సెగ్మెంట్ల లో ఏ ఎన్నిక జరిగినా పోలింగ్ శాతం తగ్గుతూ వస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ సెగ్మెంట్‌లో 50శాతం కూడా పోలింగ్‌నమోదు కాలేదు. హైదరాబాద్‌లో ఎప్పుడూ ఓట్లు పెద్దగా పోల్ కావటం లేదు. గత శాసనసభ ఎన్నికల్లో 48శాతం మాత్రమే పోలింగ్ నమోదయింది. ఇప్పుడంటే మే నెల.. ఎండలు, వేడి అనుకోవచ్చు. శాసనసభ ఎన్నికల్లో ఎండలు లేవు. చల్లగా ఉన్నా సరే.. పోలింగ్ కేంద్రాల వైపు కూడా తొంగి చూడలేదు. సెలవు రోజుల్లో సొంతూళ్లకు పోయే వాళ్లు కొందరైతే.. హాలిడే ట్రిప్‌లు వేసే వాళ్లు ఇంకొందరు. ఎవరు గెలిస్తే ఏంటి.. ఏం మార్పొస్తుంది అనే అసంతృప్తి చాలావరకు ఓటర్లను ఇల్లు కదలకుండా చేస్తోంది. నోటాలాంటి ఆప్షన్‌తో ఎవరికీ ఓటేయలేదని చెప్పే అవకాశం ఉన్నా… దాన్ని యూజ్ చేసుకునే వారు తక్కువే.
ఈ దేశాన్ని దేవుడు మారుస్తాడో లేదో తెలీదు కానీ, జనం వేసే ఓటు కచ్చితంగా మారుస్తుంది. పెద్దగా చదువుకోని పల్లె జనానికి తెలిసిన విషయం నగరవాసులకు అర్థం కావటం లేదు. ఓటు హక్కు ఊరికే రాలేదు. పోరాడితే వచ్చింది. కొన్ని దేశాల్లో ఓటు హక్కు కోసం ఇప్పటికీ పోరాటాలు జరుగుతున్నాయ్. ఎన్నికలు భవితను మార్చే సోపానాలు. రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. నగరవాసులు ఓటును ఏ మాత్రం సద్వినియోగం చేసుకోవటం లేదు. గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ శాతం 80శాతాన్ని మించిపోతే. నగరాల్లో మాత్రం నానాటికీ పరిస్థితి పడిపోతోంది. నగరాల్లో సామాజిక స్పృహ చాలా ఎక్కువ. ఆరోగ్యంగా ఉండాలని 5K రన్‌లు చేస్తారు. మొక్కలు నాటండి అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. తడిచెత్త, పొడి చెత్త అని నీతి సూత్రాలు చెప్తారు. హక్కులకు భంగం కలిగితే… రోడ్డెక్కి నినాదాలు చేస్తారు. వర్షాలు పడి రోడ్లు మునిగిపోతే పాలకుల్ని తిట్టుకుంటారు. రోడ్లు బాగోలేకపోతే.. కారణం పాలకులే అని చెప్పేస్తారు. ఆ పాలకుల్ని ఎన్నుకునే హక్కు, ఆయుధం.. తన చేతుల్లోనే ఉందని గుర్తించటం లేదు. అందుకే ఎప్పటిలాగే ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా హైదరాబాదీ తీరు ఏ మాత్రం మారలేదని రుజువైంది.