టీమిండియా ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉంది. ఈ నెల రెండో వారం తర్వాత బంగ్లాదేశ్ తో సిరీస్ మొదలుకాబోతోంది. పలువురు యువక్రికెటర్లు బంగ్లాతో సిరీస్ కోసం జట్టులో చోటు దక్కుతుందని ఎదురుచూస్తున్నారు. దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో సత్తా చాటి సెలక్టర్ల దృష్టిలో పడేందుకు రెడీ అయ్యారు. సొంతగడ్డపై జరిగే సిరీస్ కు టీమిండియా పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగబోతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టగా… ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న విరాట్ కోహ్లీ దాదాపు 8 నెలల తర్వాత టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయమైనప్పటకీ తర్వాత వరుసగా న్యూజిలాండ్, ఆసీస్ తో సిరీస్ లు ఆడనుంది. దీంతో తన సూపర్ ఫామ్ కొనసాగించాలని కోహ్లీ భావిస్తున్నాడు.
అలాగే వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ రీఎంట్రీ కూడా ఖాయమైంది. మరో వికెట్ కీపర్ గా ధృవ్ జురెల్ తన ప్లేస్ నిలుపోనుండగా..సర్ఫ్ రాజ్ ఖాన్ కూడా చోటు దక్కించుకునే అవకాశముంది. ఆల్ రౌండర్లుగా జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ ఎంపికవడం ఖాయం. అలాగే స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ను తీసుకునే అవకాశముంది. ఇక పేస్ విభాగంలో బూమ్రా, షమీ లేకపోవడంతో మహ్మద్ సిరాజ్ లీడ్ చేయనున్నాడు. అతనితో పాటు ముఖేశ్ కుమార్ , అర్షదీప్ సింగ్ లేద ఆకాశ్ దీప్ ఎంపికయ్యే అవకాశముందని తెలుస్తోంది. కాగా బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానుండగా… చెన్నై, కాన్పూర్ ఆతిథ్యమివ్వనున్నాయి.