దాదాపు 7 వారాల విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు మళ్ళీ బిజీ కాబోతోంది. వచ్చే 12 నెలల పాటు తీరికలేని క్రికెట్ ఆడేందుకు రెడీ అవుతోంది. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ తో పలువురు స్టార్ ప్లేయర్స్ జట్టులోకి అడుగుపెట్టనున్నారు. ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ వచ్చే వారం ప్రకటించనుంది. ఊహించినట్టుగానే విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ రెడ్ బాల్ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. కోహ్లీ చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. దాదాపు 8 నెలల తర్వాత మళ్ళీ సుధీర్ఘ ఫార్మాట్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే కారు ప్రమాదం తర్వాత ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైన మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు టెస్ట్ జట్టులో కూడా చోటు దక్కించుకోనున్నాడు. ఇక మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా జట్టులోకి తిరిగి రానున్నట్టు తెలుస్తోంది.
ఇక బంగ్లాతో సిరీస్ కు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయనున్నారు. ఆల్ రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్… ప్రధాన స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ లకు చోటు ఖాయం. అయితే పేస్ విభాగంలో మార్పులు జరగనున్నాయి. బూమ్రా, షమీ బంగ్లాతో సిరీస్ ఆడే అవకాశాలు లేవు. కివీస్ తో జరిగే సిరీస్ నుంచే వీరిద్దరూ జట్టులోకి వచ్చే అవకాశముంది. దీంతో భారత పేస్ ఎటాక్ ను మహ్మద్ సిరాజ్ లీడ్ చేయనున్నాడు. ముకేశ్ కుమార్ తో పాటు అర్షదీప్ సింగ్, హర్షీత్ రాణా, ఒక ప్లేస్ కోసం పోటీపడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్ లలో ప్రదర్శనను కూడా అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకుంటోంది.