తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్షనేతను ఇంకా ఎన్నుకోలేదు. ఎన్నికలు ముగిసి నెల రోజులైనా లీడర్ ను ఎంపికచేయలేని పరిస్థితుల్లో ఉంది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. మొన్నా మధ్య బీజేపీ సీనియర్ నేత అమిత్ షా వచ్చినప్పుడు.. బీజేపీ ఎల్పీ లీడర్ ను ఎన్నుకుంటారని అన్నారు. కానీ ఎంపిక చేయలేదు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8సీట్లు గెలిచింది బీజేపీ. ఎమ్మెల్యేల్లో ఇద్దరు మినహా మిగతా ఆరుగురు ఫస్ట్‌టైం అసెంబ్లీలోకి అడుగుపెట్టిన వారే. ఈ పరిస్థితుల్లో ఇంతవరకు శాసనసభా పక్ష నేతను ఎన్నుకోలేదన్న చర్చ ఇటు రాజకీయ వర్గాలతో పాటు అటు పార్టీలో కూడా విస్తృతంగా జరుగుతోంది. ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో ఉత్కంఠగానే ఎదురు చూస్తున్నారు. గత అసెంబ్లీలో శాసనసభ పక్ష నేతగా కొనసాగారు రాజాసింగ్. మత పరమైన కామెంట్స్ వివాదంతో ఆయన్ని సస్పెండ్ చేశాక… అప్పట్లో కొత్త వారిని పెట్టలేదు. ఎలక్షన్ టైంలో రాజాసింగ్ మీదున్న సస్పెన్షన్‌ను ఎత్తేసి టిక్కెట్ ఇవ్వడం, తిరిగి గెలవడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఇప్పుడు మరోసారి అవకాశం దక్కుతుందా లేక వేరే ఎవరినైనా ఎంపిక చేస్తారా అన్న చర్చ జరుగుతోంది పార్టీలో. ఇటీవల ఐదు రాష్ట్రాలకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అక్కడ ఎల్పీ లీడర్స్ ఎన్నిక రోజుల వ్యవధిలోనే తేలిపోయింది. కానీ.. కేవలం 8మంది ఎమ్మెల్యేలున్నచోట ఆలస్యం ఎందుకవుతోందన్న ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పలేకపోతున్నాయి బీజేపీ వర్గాలు. ఆలస్యం అయ్యేకొద్దీ రకరకాల అనుమానాలు కూడా పెరుగుతున్నాయట పార్టీ వర్గాల్లో.
ఇటీవల పార్టీ అగ్రనేత అమిత్ షా రాష్ట్రానికి వచ్చారు. అప్పుడాయన ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అవుతారని, శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారని చెప్పారు. కానీ… చివరికి భేటీ జరగలేదు.. ఎల్పీనేత ఎన్నిక లేదు. మంచు వల్ల ఫ్లైట్ ల్యాండింగ్ ఇబ్బంది అవుతుందని త్వరగా వెళ్ళిపోయారంటూ టెక్నికల్ రీజన్స్ చెప్పారు. ఎంత టైం లేకుంటే మాత్రం.. ఉన్నది 8 మంది అందులో ఆరుగురు ఫ్రెషర్స్. ఒకర్ని నాయకుడిగా ఎన్నుకోడానికి నెల రోజుల సమయమా.. అని పార్టీ నాయకులే నోరెళ్ళబెడుతున్న పరిస్థితి. దీన్ని ఆసరా చేసుకునే మరో ప్రచారం కూడా బయలుదేరింది.
ఇప్పటికిప్పుడు అర్జెంట్ ఏమీ లేదు గనుక లోక్‌సభ ఎన్నికల తర్వాతే ఉంటుందన్నది దాని సారాంశం. అయితే మరీ అంత ల్యాగ్ ఉండదనీ.. ఆ లోపే ప్రక్రియను పూర్తి చేస్తారని అంటున్నారు ముఖ్య నాయకులు. త్వరలోనే శాసనసభ పక్షా నేత ఎన్నిక కోసం కేంద్ర పార్టీ పరిశీలకుడు వస్తారని, ఆయన ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని ప్రక్రియను పూర్తి చేస్తారని అంటున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. శాసనసభా పక్ష నేతగా రేస్‌లో రాజాసింగ్‌తో పాటు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. రేస్‌లో ఉన్నది ఇద్దరే గనుక పెద్దగా ఈక్వేషన్స్, కేలిక్యులేషన్స్‌ను దృష్టిలో పెట్టుకోవడం లాంటివేవీ ఉండబోవంటున్నాయి పార్టీ వర్గాలు.