బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) కంటోన్మెంట్ ఎమ్మెల్యే (Cantonment MLA) లాస్య నందిత (Lasya Nandita) ఇక లేరు. ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయారు. అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ ఓఆర్‌ఆర్ (ORR) పై లాస్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో లాస్య అక్కడిక్కడే చనిపోయారు. ఆమె డ్రైవర్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. లాస్య నందిత మృత దేహాన్ని పటాన్‌చెరులోని అమేధ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి ప్రాథమికంగా మూడు ప్రధాన కారణాలను గుర్తించారు.
ప్రమాద సమయంలో మిడిల్ సీట్‌లో కూర్చున్న లాస్య సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. కారు వేగంగా డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఆమె ఫ్రంట్ సీట్‌కు బలంగా గుద్దుకున్నారు. దీంతో ఇంటర్నల్ ఆర్గాన్స్‌లో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో లాస్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక రీసెంట్‌గా కూడా లాస్య నందిత ప్రమాదానికి గురయ్యారు. రీసెంట్‌గా బీఆర్‌ఎస్ పార్టీ నల్గొండలో ఏర్పాటు చేసిన సభకు నందిత హాజరయ్యారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న స్కార్పియో కారు ప్రమాదానికి గురైంది. ఇప్పుడు యాక్సిడెంట్ చేసిన డ్రైవరే అప్పుడు కూడా లాస్య కారు నడిపాడు. ఆ డ్రైవర్‌ను మార్చి ఉంటే ఇవాళ లాస్యకు మరోసారి యాక్సిడెంట్ జరిగేది కాదంటున్నారు పోలీసులు.
ఇక ఆమె ప్రయాణిస్తున్నా కారు కూడా ఆమె చనిపోడానికి ఓ కారణమని చెప్తున్నారు పోలీసులు. లాస్య తన కారులో కాకుండా మారుతీ ఎక్స్‌ఎల్ 6 కారులో ప్రయాణిస్తున్నారు. ఈ కారులో సేఫ్టీ ఫీచర్స్ చాలా తక్కువగా ఉంటాయని.. ఇలాంటి కార్లను చాలా జాగ్రత్తగా నడపాలని అంటున్నారు పోలీసులు. కానీ లాస్య డ్రైవర్ అవగాహన లేకుండా కంట్రోల్ లేకుండా కారును నడపడం వల్లే ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగిందని చెప్తున్నారు. ఈ మూడు విషయాల్లో ఏ ఒక్కటి లాస్య పాటించినా ఇవాళ ఆమె ప్రాణాలు పోయేవి కాదంటున్నారు పోలీసులు.