Onion Prices: కొనకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిధర.. ఎప్పటి వరకూ ఇలా..?

రోజూ తినే కర్రీల్లో ఉల్లిలేనిదే ముద్దదిగదని భావిస్తూ ఉంటారు కొందరు. అలాంటి వారికి ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఉల్లి ధరలు చేదు అనుభూతిని ఇస్తోంది. కేజీపై సగటున 20 నుంచి 30 రూపాయలు అధిక భారం పడుతోంది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Publish Date - October 22, 2023 / 10:42 AM IST

ఉల్లి ఇదే ఇప్పుడు పెద్ద లోల్లిగా మారింది. సాధారణంగా ఏ రెస్టారెంట్లు, హోటళ్లు, పానీ పూరీ బడ్డీ కొట్లకు వెళ్లినా కస్టమర్ ఉల్లి కొంత వెయ్యమని అడుగుతారు.అయితే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఉల్లి ధరలు పెరగడమే దీనికి అసలైన కారణం. సగటు మానవుడు నిత్యవసరాల వస్తువులను కొనుగోలు చేయాలంటే కందిపప్పు కిలో రూ. 180 నుంచి రూ. 200 పలుకుతోంది. ఇక బియ్యం, వంట నూనెల సంగతైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలే దసరా రావడంతో ఎప్పుడో కొండెక్కి కూర్చున్నాయి. ఇలా నిత్యవసరాల ధరలు మండిపోతుండటంతో సగటు మానవుడు ఈ భారం నుంచి ఉపశమనం పొందేందుకు ఇబ్బందిగా మారుతోంది.

కిలో రూ. 30 కాస్త రూ. 50 పలుకుతోంది..

వీటన్నింటికి తోడూ నేనున్నా అంటూ ఉల్లి ధర పెరిగిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధర కిలో రూ. 45 దాటింది. ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తే కిలో రూ. 50 కి చేరింది. సాధారణంగా ఆనియన్స్ కిలో రూ. 30 ఉంటుంది. అయితే తాజాగా రూ. 15 నుంచి 20 రూపాయల ధర పెరిగింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. దీంతో సామాన్యులు ఉల్లి కొనాలంటే ఆందోళనకు గురవుతున్నారు. కొని పెట్టుకుంటే పాడైపోతాయి. కొనకుండా ఉంటే ధరలు పెరిగిపోతాయని ఆలోచిస్తున్నారు.

ఉల్లి ధర పెరుగుదలకు కారణం..

మనకు ఈ సారి వాయూవ్య రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. దీంతో వర్షాభావ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. ఇక మన్నటి వరకూ ఈశాన్య రుతుపవనాలు అధిక వర్షం కారణంగా కొంత పంట దెబ్బతింది. ఈ రెండు కారణాలు ఉల్లి పంట పై పడింది. దీంతో సాగు సకాలంలో ఉత్పత్తి అవడంలేదు. ఉల్లితోట సాగులో దాదాపు 120 రోజులు ఆలస్యం అయినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు రోజుకు 600 టన్నులు మాత్రమే దిగుమతి అవుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం కర్ణాటకలోని రానుల్, బళ్లారి ప్రాంతాల నుంచి ఏపీ మొత్తం ఉల్లి సరఫరా అవుతుంది. అయితే సాగు ఆలస్యం కావడంతో ఈ రెండు ప్రాంతాల్లో సాగు చేసిన ఉల్లి అక్కడి స్థానికులకే అధిక శాతంలో సరఫరా అయింది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఉల్లికి భారీగా కొరత ఏర్పాడింది. ఇక్కడి వ్యాపారులు మహారాష్ట్ర నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో రవాణా, డిమాండ్, సప్లై కొరత కారణంగా ధరలు పెరిగిపోయాయి.

నవంబర్ నుంచి పరిస్థితి ఇలా..

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఉల్లి కొరత ఈ నెల చివరి నాటికి క్రమక్రమంగా తొలగిపోతుంది. నవంబర్ మొదటి వారంలో కొత్త ఉల్లి పంట మార్కెట్లోకి వస్తుంది. ఇది అన్ని ప్రాంతాలకు అవసరమైన డిమాండుకు తగ్గట్లుగా సరఫరా చేయగలిగితే క్రమక్రమంగా ఉల్లి ధర తగ్గుతుందని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. పరిస్థితులన్నీ సర్థుమణిగి కిలో ఉల్లి ధర రూ. 20 నుంచి రూ. 30 కి చేరాలంటే కొంత సమయం పాటూ కస్టమర్లు వేచి ఉండక తప్పదు. ప్రస్తుతం ఉన్న దసరా పండుగ సీజన్లలో కొనుగోళ్లు పెరిగితే ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. వీటి ధరలపై కేంద్రం చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. ఏది ఏమైనా మన్నటి వరకూ టమాట, నేడు ఉల్లి సామాన్యుడికి భారంగా మారింది.

T.V.SRIKAR