ప్రపంచ క్రికెట్ లో దక్షిణాఫ్రికా అంత దురదృష్టమైన జట్టు మరొకటి ఉండదనే విషయం మరోసారి రుజువైంది. మెగా టోర్నీల్లో చోకర్స్ గా పిలిచే సఫారీలకు ఎప్పటికప్పుడు ప్రపంచకప్ అనేది కలగానే మిగిలిపోతోంది… ఈ ఏడాది అయితే అటు పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్ లోనూ రన్నరప్ గానే నిలిచిన సౌతాఫ్రికాకు మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ లోనూ నిరాశే మిగిలింది. అమెరికా,వెస్టిండీస్ వేదికగా జరిగిన పురుషుల టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా అద్భుతంగానే ఆడింది. టైటిల్ ఫేవరెట్ టీమిండియాలానే అసలు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్లో అడుగుపెట్టింది. తుది పోరులోనూ చివరి వరకూ పోరాడింది. అసలు ఒక దశలో భారత్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ టీమిండియా బౌలర్లు చివర్లో అద్భుతం చేశారు. చివరి ఓవర్ లో కూడా సౌతాఫ్రికా విజయంపై ఆశలు నిలిచినా… బౌండరీ లైన్ దగ్గర సూర్యకుమార్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ వారికి ప్రపంచకప్ దూరమైంది.
ఇప్పుడు మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ లోనూ సఫారీ జట్టు టోర్నీ ఆరంభం నుంచీ అదరగొట్టింది. లీగ్ స్టేజ్ లో ఇంగ్లాండ్ పై ఓడిన సౌతాఫ్రికా అమ్మాయిలు తర్వాత సెమీస్ లో మాత్రం సంచలనం సృష్టించారు. ఏకంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాకిచ్చారు. కంగారూల బౌలింగ్ ను చీల్చి చెండాడి టార్గెట్ ను సునాయాసంగా ఛేదించిన సౌతాఫ్రికా మహిళల జట్టు వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే టైటిల్ కలను మాత్రం ఈ సారి కూడా నెరవేర్చుకోలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 158 పరుగులు చేసింది. కీలక సమయంలో వికెట్లు తీసినా కివీస్ బ్యాటింగ్ ను అనుకున్న రీతిలో కట్టడి చేయలేకపోవడం సఫారీలకు మైనస్ గా మారింది.
అనంతరం ఛేజింగ్ లో సౌతాఫ్రికా ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించినా ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోయింది. మిడిల్ ఓవర్స్ లో కివీస్ పుంజుకుని పై చేయి సాధించడంతో సౌతాఫ్రికా మహిళల జట్టు 9 వికెట్లకు 126 పరుగులకు పరిమితమైంది. ఫైనల్లో ఉండే ఒత్తిడిని తట్టుకోవడంలో మరోసారి విఫలమైనట్టు కనిపించింది. 2023 టీ20 ప్రపంచకప్‌లోనూ సౌతాఫ్రికా టైటిల్ పోరుకు చేరింది. అప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఓడి కప్‌ను చేజార్చుకున్న సఫారీ అమ్మాయిలకు ఈ సారి న్యూజిలాండ్ అడ్డుపడింది. కాగా ఫైనల్ మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా అమ్మాయిలు భావోద్వేగానికి గురయ్యారు. ఓటమి బాధతో తమ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.