Kalki movie : కల్కి సినిమాలో కనిపించిన టెంపుల్‌ ఇదే.. దీని ప్రత్యకత ఏంటంటే..

నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లపాడులో ఉన్న పురాతన ఆలయాన్ని ఇప్పుడు యూటూబర్లు, వ్లాగర్లు చుట్టేస్తున్నారు. కల్కి సినిమాలోని ఓ సీన్‌లో ఈ గుడి కనిపించడమే ఇందుకు కారణం..

నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లపాడులో ఉన్న పురాతన ఆలయాన్ని ఇప్పుడు యూటూబర్లు, వ్లాగర్లు చుట్టేస్తున్నారు. కల్కి సినిమాలోని ఓ సీన్‌లో ఈ గుడి కనిపించడమే ఇందుకు కారణం. కల్కి సినిమాలో ఓ పాప తనను వెంటాడే విలన్ల రోబోట్ నుంచి తప్పించుకుంటూ ఇసుకలో జారుకుంటూ వచ్చి అక్కడే ఉన్న ఒక గుడి గోపురం కిందకు దూరి లోపల దాక్కుంటుంది. ఆ సీన్‌లో కనిపించిన ఆలయం, పెరుమాళ్లపాడు దగ్గర్లోని ఆలయమేనని తెలియడంతో ఈ గుడి ఫేమస్‌ అయ్యింది. పెరుమాళ్లపాడు సమీపంలో ఉన్న పెన్నా నది తీరంలో కొన్నేళ్ల కిందట ఈ దేవాలయం బయటపడింది. ఇసుక ఎడారిలా ఉన్న ప్రాంతం మధ్యలో.. ఆయల పైభాగం మాత్రం ఇలా బయటికి కనిపిస్తూ ఉంటుంది.

ఇది శివాలయమని, అక్కడ ఉన్నది నాగలింగేశ్వరుడని సోమశిల ప్రాంత ఆలయాల అధికారులు చెప్తున్నారు. కానీ ఈ గుడిని ఎవరు కట్టించారు. ఎన్ని వందల ఏళ్ల క్రితం కట్టించారు అనే వివరాలు మాత్రం అధికారులు దగ్గర కూడా లేవు. కానీ ఆలయ నిర్మాణ శైలిని బట్టి అది చోళుల కాలం నాటిదని చెప్తున్నారు చరిత్రకారులు. చోళులు 12, 13వ శతాబ్దంలో నెల్లూరు ప్రాంతం వైపు వచ్చారు. ఆ కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని చెప్తున్నారు. ఈ గుడి ఎలా భూమిలో కూరుకుపోయింది అనేందుకు ఆధారాలు లేవు.

గతంలో భారీ వరదలు వచ్చినపుడు నెల్లూరు ప్రాంతంలో ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయని, ఈ ఆలయం కూడా ఆ సమయంలో భూస్థాపితమై ఉండవచ్చని చెప్తున్నారు. 1927లో పెద్ద గాలివాన ఒకే ఒక్క రోజులో జిల్లాని అతలాకుతలం చేసింది. వేల మంది చనిపోయారు. ఆ సమయంలో పెరుమాళ్ళపాడే కాదు, ఎన్నో గ్రామాలు కోతకు గురయ్యాయి. వరదలో కొట్టుకుపోయాయి. 1884, 1872 బలమైన వరదలు వచ్చినపుడు మాత్రం చాలా ఊర్లు మునిగిపోయాయి. అప్పుడు ఈ ఆలయం కూడా మునిగిపోయి ఉండొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. పెరుమాళ్లపాడులోని ప్రజలు కూడా కొందరు ఆ గుడికి సంబంధించిన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.

60 ఏళ్ల కిందట గోపురం కనిపించేదని, అక్కడ ఆడుకునే వాళ్లమని అక్కడి స్థానికులు చెప్తున్నారు. ఊరి పెద్దల ద్వారా ఆ గుడి కథలు విన్న కొందరు యువకులు కరోనా సమయంలో అక్కడ తవ్వకాలు జరిపారట. అప్పుడు ఆ గుడి గోపురం బయట పడింది. ఇదే గుడిని ఇప్పుడు తమ గ్రామానికి దగ్గరగా నిర్మించుకునేందుకు గ్రామస్థులు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఏది ఏమైనా కల్కి సినిమాతో ఇప్పుడు ఈ టెంపుల్‌ దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయ్యింది.