Chevella, Lok Sabha Elections : చేవెళ్ల లోని పార్లమెంట్ సభ్యులందరు క్యాష్ పార్టీలే..

చేవెళ్ళ లోక్ సభ నియోజకవర్గంలో ఈసారి అభ్యర్థులంతా క్యాష్ పార్టీలే. ఎన్నికల అఫిడవిట్స్ ప్రకారం... రాష్ట్రంలోనే అత్యంత సంపన్న అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు... BRS నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ పడుతున్నారు.

 

చేవెళ్ళ లోక్ సభ నియోజకవర్గంలో ఈసారి అభ్యర్థులంతా క్యాష్ పార్టీలే. ఎన్నికల అఫిడవిట్స్ ప్రకారం… రాష్ట్రంలోనే అత్యంత సంపన్న అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు… BRS నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ పడుతున్నారు. ఇక్కడి ఎన్నికల్లో మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని BRS, పూర్వ వైభవం తేవాలని కాంగ్రెస్… కొత్తగా ఖాతా తెరవాలని బీజేపీ పట్టుదలగా ఉన్నాయి. మూడు పార్టీల అభ్యర్థులు రంజిత్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, కాసాని మధ్య పవర్ ఫైట్ ఎలా ఉండబోతోంది చూద్దాం.

చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడొంతులు హైదరాబాద్ పట్టణ ప్రాంతం ఉంటే… మిగిలిన ఏరియా గ్రామీణం. వీళ్ళల్లో 65శాతం మంది అర్భన్ ఓటర్లే. ఇక్కడ సెటిలర్ల ఓట్లే కీలకం. ఏపీతో పాటు…దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లే చేవెళ్ళ గెలుపోటములను డిసైడ్ చేస్తుంటారు. మొత్తం 29 లక్షల 38 వేలకు పైగా ఓట్లు ఉన్నాయి. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవెళ్ళ నియోజకవర్గాల్లో BRS అభ్యర్థులు గెలిచారు. వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.

ఈసారి చేవెళ్ళ పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ముగ్గురూ హేమాహేమీలే. పౌల్ట్రీ వ్యాపారవేత్త, సిట్టింగ్ ఎంపీ అయిన రంజిత్ రెడ్డి BRS కి రిజైన్ చేసి… కాంగ్రెస్ లో చేరి ఇక్కడ టిక్కెట్ సంపాదించారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ తరపున, మాజీ జడ్పీ ఛైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ BRS నుంచి పోటీలో ఉన్నారు. చేవళ్ళ పార్లమెంట్ సీటుపై కన్నేసిన కాంగ్రెస్ నేతలను కాదని… ఎన్నికల షెడ్యూల్ ముందు BRS నుంచి జంప్ అయిన రంజిత్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చింది అధిష్టానం. దాంతో కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీతారెడ్డి కూడా చేవెళ్ళ టిక్కెట్ ను ఆశించారు. మాజీ ఎమ్మెల్యే KLR కూడా ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. కానీ వీళ్ళెవరికీ కాకుండా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళని బుజ్జగించేందుకు రంజిత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఇంకా వర్కవుట్ కాలేదు.

ఇక చేవెళ్ళలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరును బీజేపీ ముందే ప్రకటించింది. ఆయన ప్రచారం కూడా ముందే స్టార్ట్ చేశారు. కానీ ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క సీటు కూడా బీజేపీకి రాలేదు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ 3వ స్థానంలో నిలిచింది. అయినప్పటికీ… మోడీ చరిష్మాతో గెలుస్తామన్న నమ్మకంతో ఓటర్లను కలుస్తున్నారు విశ్వేశ్వర్ రెడ్డి. భారీ బహిరంగ సభలు కూడా… ప్రతి గ్రామానికీ వెళ్ళి ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీగా గెలిస్తే చేవెళ్ళ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేస్తానో వివరిస్తూ… చేవెళ్ళ సంకల్ప పత్రాన్ని విడుదల చేశారు విశ్వేశ్వర్ రెడ్డి. నియోజకవర్గంలో 3 వేల 700 కిలోమీటర్ల ప్రజా ఆశీర్వాద యాత్ర చేశారు.

సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లోకి సడన్ గా జంప్ అవడంతో బీఆర్ఎస్ చాలా ఇబ్బందులు పడింది. ఆ తర్వాత బీసీ కార్డును వాడుకునేందుకు చేవెళ్ళలో కాసాని జ్ఞానేశ్వర్ ను రంగంలోకి దింపింది. ఇక్కడ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లను బీఆర్ఎస్సే గెలుచుకోవడంతో… మళ్ళీ గెలుపు తమదే అంటున్నారు గులాబీ పెద్దలు. చేవెళ్ళ ఇంఛార్జ్ బాధ్యతలను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీసుకొని బీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ MIM ఓటు బ్యాంక్ కూడా కీలకంగా ఉంటుంది. గతంలో BRSకు MIM కు దోస్తీ ఉండేది… కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు MIM మొగ్గు చూపిస్తుండటంతో ఆ ఓట్లు ఎటు పడతాయన్నది చూడాలి. కానీ కాంగ్రెస్, బీజేపీ నుంచి రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులు ఉంటే… తాము బీసీలకు సీటు ఇచ్చామని BRS చెప్పుకుంటోంది. దాదాపు 5 లక్షల దాకా ఉన్న మైనార్టీల ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీకే చేవెళ్ళలో గెలుపు అవకాశాలు ఉంటాయంటున్నారు విశ్లేషకులు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, కేంద్రంలో మోడీ హవా నడుస్తుండటం… పైగా చేవెళ్ళ నియోజకవర్గంలో ఎక్కువగా సెటిలర్ల ఓట్లే ఉండటంతో BRS ఎంతవరకు గెలుస్తుందన్నది చూడాలి.