ఆంధ్రప్రదేశ్ లో ఈసారి పొలిటికల్ ఈక్వేషన్లు పూర్తిగా మారిపోతున్నాయి. కాపులు, ఎస్టీలు, ఎస్సీలు, క్రిస్లియన్లు, ముస్లింలు.. వీళ్ళ ఓట్లు ఎటు టర్న్ అవుతాయో తెలియని పరిస్థితి ఉంది. గతంలో లాగా గంప గుత్తాగా ఒకే పార్టీకి పడతాయని అనుకుంటే పొరపాటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైఎస్ షర్మిల్ కాంగ్రెస్ లోకి రావడంతో క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీల ఓట్లు.. వైసీపీకి పడే అవకాశం లేదంటున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసుల్లో జైల్లో ఉన్నప్పుడు వైసీపిని నడిపించడంలో … ఆ తర్వాత 2019లో ఎన్నికల ప్రచారంలోనూ షర్మిల, విజయమ్మ కీలకంగా వ్యవహరించారు. వైసీపీ అధికారంలోకి రావడంలో క్రిస్టియన్లు కూడా కీలకంగా మారారు. అందుకోసం అప్పట్లో బ్రదర్ అనిల్ కీ రోల్ ప్లే చేశారని అంటారు. గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో జగన్ పార్టీకి తిరుగులేదు. ఏపీలో క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ప్రభావం ఎక్కువే. ఎస్సీల్లో ఎక్కువ మంది క్రిస్టియన్ మతం స్వీకరించిన వాళ్ళే ఉంటారు. అందుకే ఏపీలో 20 నుంచి 30 నియోజకవర్గాల్లో క్రిస్టియన్ల ప్రభావం ఉంటుంది. గత ఎన్నికల్లో ఎస్సీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ హవా నడిచింది.
ఏపీలో బ్రదర్ అనిల్ కుమార్ క్రిస్టియన్ ఓటు బ్యాంకును వైసీపీకి మరల్చడంలో కీలకంగా వ్యవహరించారు. చాలా నియోజకవర్గాల్లోని చర్చిలు, ప్రార్థనా మందిరాలు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు పాస్టర్లు, మత ప్రబోధకులను బ్రదర్ అనిల్ ప్రభావితం చేసినట్టు చెబుతారు. ఎస్టీ నియోజకవర్గాల్లోనూ క్రిస్టియానిటీ ప్రభావం ఉంది. అందుకే ఒక్క ఎస్టీ సీటును కూడా టీడీపీ దక్కించుకోలేకపోయింది.
షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో.. ఈసారి ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ హవా ఎంతో కొంత కనిపిస్తుందని అంటున్నారు. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ను బ్రదర్ అనిల్ ఈసారి హస్తం పార్టీకి టర్న్ చేసే ఛాన్సుంది. సాధారణంగా ఎస్సీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు మొదటి నుంచీ ఆదరణ ఎక్కువే. ఈ 10యేళ్లల్లో ఏపీలో కాంగ్రెస్ ఉనికి కోల్పోవడంతో.. జనం వైసీపీ వైపు మొగ్గు చూపారు. మళ్ళీ కాంగ్రెస్ పుంజుకొని, షర్మిల తిరిగి వైఎస్సార్ పేరును జనంలోకి తీసుకెళ్ళడం, అక్కడి ఓటు బ్యాంక్ పై అనిల్ ప్రభావం చూపడం.. లాంటి కలిసొస్తాయని అంటున్నారు. సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లిం మైనార్టీలు యూటర్న్ తీసుకుంటే.. కాంగ్రెస్ 10 సీట్లకు పైనే గెలిచే ఛాన్స్ ఉంది. అందుకేనేమో రాహుల్ గాంధీ ఏపీలో 15శాతం ఓట్లు సాధించేందుకు లక్ష్యంగా పెట్టుకోవాలని ఏపీ కాంగ్రెస్ నేతలకు పిలుపు ఇచ్చారు. ఇప్పుడీ వర్గాలన్నీ కాంగ్రెస్ కు టర్న్ అయితే.. వైసీపీకి చాలా నష్టం వాటిల్లబోతోంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను మారుస్తున్నారు జగన్. ఆ ఎఫెక్ట్ కూడా పడిందంటే.. ఇక ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా వచ్చే ఛాన్స్ లేదంటున్నారు.