Marriages On Elections: ఒకవైపు ఎన్నికల నగారా.. మరోవైపు పెళ్లిళ్ల భాజా.. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిసందడి మామూలుగా ఉండదు

ఈ సారి పెళ్లిళ్లకు ఎన్నికల ఎఫెక్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్నికలు జరిగే సమయంలోనే అన్ని పెళ్లి ముహూర్తాలు అధికంగా ఉండటంతో పరిస్థితి సందడితో పాటూ డిమాండ్ గా మారిపోయింది. దీంతో కొందరు ఎలాగైనా పెళ్లి చేసి పంపాలని భావిస్తుంటే.. మరి కొందరు తలకు మించిన భారంగా ఇబ్బందులకు గురవుతున్నారు.

  • Written By:
  • Publish Date - October 9, 2023 / 08:17 AM IST

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని ఘట్టం. తన కుటుంబంలోనే కాదు తన శరీరంలోనూ అర్థభాగాన్ని కేటాయించడమే జీవిత భాగస్వామికి నిర్వచనం. ఇలాంటి పెళ్లి వేడుకలకు తెలుగు రాష్ట్రాలు వేదికయ్యాయి. ఈ దసరా మొదలు అమ్మవారి సంపూర్ణ అనుగ్రహంతో ప్రారంభమైన పెళ్లి ముహూర్తాలు ఏప్రిల్ వరకూ కొనసాగనున్నాయి. ఆ తరువాత అర్థ సంవత్సరం వరకూ ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవంటున్నారు పండితులు. ఇక సీన్ కట్ చేస్తే అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలవనుంది. ఈ సారి ఇరు రాష్ట్రాల్లో పోటీ మామూలుగా ఉండదు. దీనికి నిలువెత్తు నిదర్శనమే ప్రస్తుత రాజకీయ పరిణామాలు. ఇలాంటి సమయంలో పెళ్లి మండపాలకు డిమాండ్ భారీగా పెరిగింది. కొన్ని చోట్ల అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ముహూర్తాన్ని బట్టి కళ్యాణ మండపం బుక్ చేసుకునే స్థాయి నుంచి పెళ్లి వేదిక అందుబాటులో ఉండే రోజుకు పరిణయ ముహూర్తాన్ని మార్చుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది.

సంక్రాంతి – వేసవి సెలవుల ఎఫెక్ట్..

మనకు ముఖ్యంగా పెద్ద పండుగలు అంటే దసరా, సంక్రాంతి, దీపావళి. వీటిని ప్రతి ఒక్కరూ బ్రహ్మండంగా జరుపుకుంటారు. దీనికి కారణం పిల్లలకు స్కూలు సెలవులు, టీచర్లకు పెద్దగా పని ఉండదు. దీంతో అందరూ తమ తమ బంధువుల ఇళ్ళకు వెళ్లి సరదాగా గడపాలనుకుంటారు. ఈ సమయంలో పెళ్లి ముహూర్తాలు ఉంటే అందరూ హాజరయ్యేందుకు ప్రయత్నిస్తారు. దీంతో పెద్ద ఎత్తున అతిథులు హాజరవుతారు. అందుకే పెద్ద కళ్యాణ మండపం అవసరం అవుతుంది. ఎన్నికలు కూడా దసరా తరువాత కొన్ని రాష్ట్రాల్లో, వేసవి సెలవుల్లో కొన్ని చోట్ల జరగనున్నాయి. దీని ప్రభావంతో కళ్యాణ వేదికలు అంత సులువుగా ఎక్కడా అందుబాటులో లభించడం లేదు. రాజకీయ నాయకులు తమ పార్టీ ప్రచారాలకు, సభలకు, సమావేశాలకు ముందస్తుగానే బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో పెళ్లి వారికి పెద్ద తంటాగా మారింది పరిస్థితి.

డిమాండ్ పెరగడంతో వసూళ్లు అధికం..

మనోళ్లు సీజనల్ వ్యాపారాలు చేయడంలో చెయి తిరిగిన వారిగా చెప్పాలి. దీనికి కారణం ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లు.. ఏ పండక్కు ఆ వ్యాపారం చేసి మంచిగా సంపాధించుకుంటారు. అందుకే ఇటు పెళ్లిళ్ల సీజన్, అటు ఎన్నికల హడావిడి. ఈ రెండింటినీ క్యాష్ గా చేసుకుంటున్నారు నిర్వహకులు. ఇక మండపాల విషయానికొస్తే సాధారణంగా వసూలు చేసేదానికన్నా రూ. 50 వేల నుంచి రూ లక్ష వరకూ అధికంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పెళ్లి ఖర్చులు, మరో వైపు కళ్యాణ మండపం అందుబాటులో లేని పరిస్థితి. దీంతో పెళ్లి పెద్ద చేసేదేమీ లేక తలపట్టుకోవాల్సి వస్తోంది. కేవలం ఈ పరిస్థితి కళ్యాణ వేదికలకే కాదు క్యాటరింగ్ మొదలు డెకరేషన్ వరకూ పూల మొదలు రూముల వరకూ అన్ని ధరలు పెరిగే అవకాశం ఉంది.

వధూవరుల పేర్లపై పడుతున్న ప్రభావం..

పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. వివాహం అనే ఆలోచన మొదలు క్రతువు వరకూ అన్ని తమ ఆధీనంలో పురోహితుని ఆధ్వర్యంలోనే నిర్ణయించబడుతున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా వధూవరుల పేర్లు మార్చి పెళ్లిళ్లు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తడమే. ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా ముందుగా నిశ్చయించుకున్న పెళ్లి ముహూర్తానికి కళ్యాణ వేదికలు ఎక్కడా అందుబాటులో ఉండటం లేదు. దీంతో పెళ్లి మండపం అందుబాటులో ఉన్న తేదీకే వధూవరుల పేర్లు మార్చి లగ్నపత్రికలు ముద్రించి పరిణయోత్సవాన్ని జరిపేందుకు సిద్దమౌతున్నారు. దీనిని బట్టి ప్రస్తుతం భూలోకంలోనే తమ ఇష్టానుసారంగా వైవాహిక బంధాలు నిర్ణయించబడుతున్నాయి అని చెప్పవచ్చు.

విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ల పరిస్థితి ఏంటి..

ఉన్నత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ మన దేశం విడిచి పరాయి దేశాలకు వెళ్లిన యువత పెళ్లికి సిద్దమయ్యారు. వీరు కూడా పండితులను సంప్రదించి తమకు నచ్చిన సంబంధాన్ని కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే వధూవరుల పెళ్లి చూపుల సమయంలోనే ఒక షరతు పెడుతున్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ మూడు నెలల్లో పెళ్లి చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారినే తమ జీవిత భాగస్వామిగా ఆహ్వానించేందుకు ముందుకు వస్తున్నారు. దీనికి కారణం డిశంబర్, జనవరిలో విదేశాల్లో పనిచేసే వారికి క్రిస్మస్ సెలవులు అందుబాటులో ఉంటాయి. ఈ సెలవులను తన పెళ్లికి ఉపయోగించుకుని తిరిగి విదేశాలకు సతీ సమేతంగా వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. దీనికి సిద్దమై పెళ్లి జరిపించేందుకు ఎవరు ముందుకొస్తే వారిని వివాహమాడేందుకు ఆసక్తి చూపుతున్నట్లు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెబుతున్నారు.

పురోహితులు ఏమంటున్నారు..

ప్రస్తుత శోభకృత్ నామ సంవత్సర పంచాంగం ప్రకారం ఉగాది వరకూ ఉన్న ముహూర్తాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అందులో భాగంగా విజయ దశమి తరువాత నుంచి క్రిస్మస్ వరకూ అద్భుతమైన వివాహ ముహూర్తాలు ఉన్నాయి. డిశంబర్ చివరి వారం నుంచి సంక్రాంతి వెళ్లే వరకూ ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవు. ఆ తరువాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ సమయం మించిపోతే వచ్చే ఏడాది 2024 అక్టోబర్ వరకూ ఎలాంటి ముహూర్తాలు లేవు. అందుకే ఈ మూడు నెలల్లో పెళ్లిళ్లు జరిపించడం ఉత్తమం అంటున్నారు సిద్దాంతులు, పండితులు. అందుకే ఈ సారి పెళ్లి ఖర్చు కాస్తా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.

T.V.SRIKAR