ఐపీఎల్ మెగావేలానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. ఆదివారం, సోమవారం సౌదీ అరేబియా సిటీ జెడ్డా వేదికగా మెగా ఆక్షన్ జరగనుండగా.. ఇప్పటికే 574 మంది ప్లేయర్స్ ను షార్ట్ లిస్ట్ చేశారు. ఈ సారి వేలంలోకి పలువురు స్టార్ ప్లేయర్స్ కూడా వచ్చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే సమయంలో పలువురు యువ ఆటగాళ్ళపైనా ఫ్రాంచైజీలు కన్నేశాయి. ఇప్పటి వరకూ అంతర్జాతీయ క్రికెట్ ఆడకున్నా… దేశవాళీ క్రికెట్ లో మెరుపులు మెరిపిస్తున్న పలువురు అన్ క్యాప్డ్ ప్లేయర్స్ కోసం ఫ్రాంచైజీలు కోట్లాదిరూపాయలు కుమ్మరించేందుకు రెడీ అయ్యాయి. ఈ సారి వేలంలో ఐదుగురు యువక్రికెటర్లు జాక్ పాట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది వైభర్ అరోరా గురించే… కోల్ కత్తా నైట్ రైడర్స్ తరపున గత సీజన్ లో అద్భుతంగా రాణించిన వైభవ్ అరోరా పేస్ బౌలింగ్ ఏ జట్టుకైనా అడ్వాంటేజ్ గానే చెప్పొచ్చు. ముఖ్యంగా పవర్ ప్లేలో మెరుగైన బౌలింగ్ చేస్తుండడం అతని ప్రధాన బలం. ఫ్రాంచైజీలు కోరుకునేది ఇదే.. బ్యాటర్ల హవాగా ఉండే ఐపీఎల్ లాంటి లీగ్స్ లో పొదుపుగా బౌలింగ్ చేసే బౌలర్లకు గట్టి డిమాండే ఉంటుంది. వైభవ్ అరోరా ఇప్పటి వరకూ ఐపీఎల్ లో 20 మ్యాచ్ లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. మరి ఈ సారి వైభవ్ ఎంత ధర పలుకుతాడో చూడాలి.
అలాగే ఆల్ రౌండర్ అశుతోష్ శర్మ కూడా వేలంలో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉన్నాడు. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ తరఫున పలు మ్యాచ్ లలో మెరుపులు మెరిపించి ఆశ్చర్యపరిచాడు . పవర్ హిట్టర్, ఫినిషర్ గా పేరున్న ఇలాంటి ప్లేయర్ కోసం చాలా ఫ్రాంఛైజీలు ఆసక్తిగా ఉంటాయి. 167 స్ట్రైక్ రేట్ తో ఆకట్టుకున్న అశుతోష్ కోసం పంజాబ్ తో పాటు మరికొన్ని ఫ్రాంచైజీలు పోటీపడే ఛాన్సుంది. ఇదిలా ఉంటే 2022 అండర్ 19 వరల్డ్ కప్ లో అత్యధిక రన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్న ప్లేయర్ రఘువంశీ. ఈ ఏడాది ఐపీఎల్లో కేకేఆర్ తరఫున కొన్ని మ్యాచ్ లలో మెరుపులు మెరిపించాడు. 19 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ను ఫ్యూచర్ యశస్వి జైస్వాల్ గా అభివర్ణిస్తున్నారు. దీంతో ఈ ఢిల్లీ ప్లేయర్ కు ఈ సారి వేలంలో మంచి డిమాండ్ ఉంటుందని అంచనా.
ఈ సారి మెగావేలంలో అందరినీ ఆకర్షిస్తున్న మరో పేస్ బౌలర్ రసిఖ్ సలామ్ దర్.. పరుగులు కాస్త ఎక్కువగా ఇస్తాడని పేరున్నా.. వికెట్లు కూడా తీసే సత్తా ఉంది. ఇటీవలే ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీలో 9 వికెట్లు తీసి ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. జట్టులో మూడో పేస్ బౌలర్ కోసం ఎదురు చూస్తున్న ఫ్రాంఛైజీలు అతనిపై ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే గత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు ఆడిన అభినవ్ మనోహర్ పైనా ఫ్రాంచైజీల కన్నుంది. నిజానికి గుజరాత్ టైటన్స్ అతన్ని సరిగా ఉపయోగించుకోలేదు. కానీ తన సత్తా ఏంటో కర్ణాటకలో జరిగిన మహారాజా ట్రోఫీ టీ20 టోర్నీలో చూపించాడు. ఏకంగా 196.5 స్ట్రైక్ రేట్ తో 507 రన్స్ చేశాడు. ప్రస్తుతం ఇండియన్ టీమ్ తో కలిసి ఆస్ట్రేలియాలో ఉన్న అభినవ్ కు వేలంలో జాక్ పాట్ తగిలే ఛాన్సుంది.