గత కొన్నేళ్ళుగా వరల్డ్ క్రికెట్ ను టీమిండియా శాసిస్తోంది. వన్డే వరల్డ్ కప్ గెలవకున్నా ఓవరాల్ గా అద్భుతమైన ప్రదర్శనతో అన్ని ఫార్మాట్లలో సత్తా చాటుతోంది. దీంతో ఇప్పుడు భారత్ సిరీస్ ఆడేందుకు వస్తుందంటే ఆసీస్ లాంటి జట్టులోనూ కంగారు మొదలవుతోంది. గత రెండు పర్యాయాలు వరుసగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచిన టీమిండియా ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేసింది. ఐదు టెస్టుల సిరీస్ కోసం డిసెంబర్ నుంచి ఆసీస్ గడ్డపై పర్యటించబోతోంది. ఈ నేపథ్యంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై అంతకంతకూ ఆసక్తి పెరిగిపోతోంది. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ ఈ సిరీస్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. కంగారూల గడ్డపై టీమిండియా ఈ సారి సిరీస్ గెలవాలంటే స్టార్ ప్లేయర్లు జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ ఎంతో కీలకమని ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు.
వారిద్దరు ఫిట్‌నెస్, ఫామ్‌తో ఉంటేనే తమ సొంతగడ్డపై భారత్ హ్యాట్రిక్ సిరీస్ అందుకోవడం ఖాయమని అంచనా వేశాడు. కారు ప్రమాదం తర్వాత తిరిగి టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్ అదరగొట్టడం భారత్‌కు అడ్వాంటేజ్ గా చెప్పాడు. సుధీర్ఘ విరామం తర్వాత రెడ్ బాల్ క్రికెట్ లో అడుగుపెట్టిన పంత్ చెన్నై టెస్టులో సెంచరీ సాధించాడు. కాగా పంత్ వికెట్ కీపర్‌గానూ మరింత మెరుగయ్యాడని, ఆస్ట్రేలియా పర్యటనలో అతను గేమ్ ఛేంజర్ అవుతాడని చాపెల్ విశ్లేషించాడు. ఇక స్టార్ పేసర్ బుమ్రా అయిదు టెస్టులూ ఆడేలా ఫిట్‌నెస్‌తో ఉంటే తమ జట్టుకు కష్టమేనని అంచనా వేశాడు. అటు యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ కు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పెద్ద ఛాలెంజ్ గా ఛాపెల్ అభివర్ణించాడు.