తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయలేని వారు లోక్ సభ ఎలక్షన్స్ కి ఓట్లేసే అవకాశం వచ్చింది. జనవరి 22 వరకు ఓటరు నమోదు, అభ్యంతరాలపై దరఖాస్తులను స్వీకరిస్తోంది ఎన్నికల కమిషన్. ఓటు లేనివాళ్ళు ఎవరైనా తమ పేరును నమోదు చేసుకోవచ్చు.
మరోమూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది ఎన్నికల కమిషన్. ఓటరు జాబితాలో కొత్తగా ఫామ్ 6 ద్వారా పేరు నమోదు చేసుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ తో తెలంగాణ అంతటా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం – 2024 జరుగుతోంది. 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు, ఓటరు జాబితాలో పేరు లేని వారు కొత్తగా ఓటు కోసం అప్లయ్ చేసుకోవచ్చు. జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. కొత్త ఓటరు నమోదుకు, ముసాయిదా జాబితాపై అభ్యంతరాలకు సంబంధించి జనవరి 22 వరకు దరఖాస్తులు తీసుకుంటారు. ఓటరు జాబితాలో పేరు నమోదుకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలను ఫిబ్రవరి 2 లోగా పరిష్కరిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదంతో ఫిబ్రవరి 8న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, ఓటర్ల జాబితా / ఫొటో ఓటరు గుర్తింపు కార్డుల్లో తప్పులు ఉంటే వాటిని సరచేయడం, ఓటర్ల జాబితాలో సరైన ఫొటోలను ప్రింట్ చేయడం లాంటి పనులను జనవరి 5 వరకు అధికారులు పూర్తిచేస్తారు. ప్రస్తుత ఓటర్ల జాబితా ప్రకారం BLOలు సర్వే చేస్తారు.