Thota Trimurthulu: శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష.. 1996 నాటి కేసులో తీర్పు

తోట త్రిమూర్తులు, అతడి అనుచరులు.. ఐదుగురు దళితులపై దారుణ హింసకు పాల్పడ్డారు. ఇద్దరికి గుండు కొట్టించి, కనుబొమ్మలు గీయించి, హింసించారు. ఆ తర్వాత ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

  • Written By:
  • Publish Date - April 16, 2024 / 05:36 PM IST

Thota Trimurthulu: ఏపీలో 1996లో సంచలనం సృష్టించిన శిరో ముండనం కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెల్లడించింది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు అట్రాసిటీ కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది. త్రిమూర్తులుతోపాటు ఆరుగురు నిందితులకు 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.5 లక్షల జరిమానా విధించింది. ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో 1996 డిసెంబర్‌ 29న ఈ ఘటన జరిగింది.

Lok Sabha Elections 2024: రోజుకు రూ.100 కోట్లు.. తనిఖీల్లో పట్టుబడుతున్న నోట్ల కట్టలు..

అప్పుడు నమోదైన కేసు వివరాల ప్రకారం.. తోట త్రిమూర్తులు, అతడి అనుచరులు.. ఐదుగురు దళితులపై దారుణ హింసకు పాల్పడ్డారు. ఇద్దరికి గుండు కొట్టించి, కనుబొమ్మలు గీయించి, హింసించారు. ఆ తర్వాత ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దీనిపై దాదాపు 28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగింది. కేసు 148 సార్లు వాయిదా పడింది. విచారణలో 10మందిని దోషులుగా గుర్తించారు. వీరిలో ఒకరు మరణించారు. అనంతరం తోట త్రిమూర్తులు, మరో ఐదుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. నిందితులకు 18 జైలు శిక్ష, జరిమానా విధించింది. తోట త్రిమూర్తులకు మరో సెక్షన్ కింద ఇంకో ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై దళిత, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

మరోవైపు కోర్టు తాజీ తీర్పును సవాలు చేస్తూ తోట త్రిమూర్తులు, ఇతర నిందితులు కోర్టును ఆశ్రయించారు. తమను అరెస్టు చేయకుండా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి అంగీకరించిన న్యాయస్థానం త్రిమూర్తులు సహా నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ.. కోర్టు తీర్పును తాను గౌరవిస్తానన్నారు. అయితే, పైకోర్టుకు అప్పీలు చేస్తానని తెలిపారు. తోట.. ప్రస్తుతం వైసీపీ తరఫున మండపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.