Israel Vs Hamas: ఇజ్రాయెల్ మెరుపు దాడికి గజగజా ఒణికిపోతున్న గాజా వాసులు

ఇజ్రాయెల్ - పాలస్తీన్ల యుద్దంలో పతనమైనది అమాయక ప్రజలు. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. లక్షల సంఖ్యలో భవనాలు నేలకూలాయి. ఈ యుద్దం దాటికి ఆ ప్రాంతం మొత్తం భూకంపం సంభవించిందా అన్న విధంగా తయారైంది.

  • Written By:
  • Publish Date - October 14, 2023 / 05:08 PM IST

ఇజ్రాయెల్ – హమాస్ సృష్టించిన బీభత్సం అంత ఇంతా కాదు. ఆయిల్ మొదలు ఐటీ పరిశ్రమల వరకూ ప్రతి ఒక్కదానిలో దీని ప్రభావం తీవ్రంగా పడింది. దీన కారణంగా కొన్ని సంస్థలు మూతపడితే.. కొన్ని ఉత్పత్తులు నిలిచిపోయాయి. సామాన్యుల నుంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వరకూ ప్రతి ఒక్కరూ తమ సొంత ఊళ్ళ బాటపట్టారు. ఇక అక్కడి నివాసితులు, వారి ఆవాసాలు పరిస్థితి అయితే మరింత క్లిష్టంగా మారింది. కనీసం ఆశ్రయానికి కూడా నోచుకోలేని పరిస్థితి ఇక్కడ దాపరించింది.

భారీ సంఖ్యలో భవనాలు నేలమట్టం..

ఇజ్రాయెల్ ను దొంగ చాటుగా దెబ్బ తీసిన హమాస్ ముందు విజృంభించి యుద్దం చేసింది. ఆ తరువాత క్రమక్రమంగా తన వేగాన్ని తగ్గించుకుంది. దీనికి కారణం ఇజ్రాయెల్ పాలస్తీన్ల వరుస దాడులను ఖండిస్తూ వైమానిక దాడులకు పాల్పడింది. ఇలా ఉగ్ర నెట్వర్క్ ను లక్ష్యంగా చేసుకుని చేసిన ఎదురుదాడిలో దాదాపు కొన్ని వేల భవనాలు నేలమట్టం అయ్యాయి. మరి కొన్ని అయితే బాంబుల శబ్ధానికి పేకమేడల్లా కుప్పకూలుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో గాజా ప్రాంతం మొత్తం మట్టిలో కలిసిపోయింది. ఐక్యరాజ్యసమితి మానవతా సంస్థ చెప్పిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 1300 భవనాలు కుప్పకూలినట్లు తేలింది. ఇదే అంశాన్ని పలు అంతర్జాతీయ మీడియా మాధ్యమాలు కొన్ని కథనాలను ప్రసారం చేశాయి.

వేల సంఖ్యలో అమాయకుల మృతి..

ఈ రెండు దేశాల యుద్దం కారణంగా అమాయక ప్రజలు బలయ్యారు. గాజాలో అయితే మరణాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. శిధిలమైన నిర్మాణాల కింద కూడా చిక్కుకొని ఉన్నారు. హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ తెలిపిన లెక్కల ప్రకారం 2215 మంది పాలస్తీన్లు మరణించినట్లు తెలుస్తోంది. గత 24 గంటల్లోనే 126 మంది చిన్నపిల్లలు మృతి చెందారు. దీంతో పాటూ మరో 8714 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారిక లెక్కలను వెల్లడించారు. ఇంతటి మారణ హోమం సృష్టించిన తరువాత ఇజ్రాయెల్ గాజాకు హెచ్చరికలు జారీచేసింది. పాలస్తీనాలో నివాసం ఉంటున్న వారు తక్షణమే ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లిపోవాలని సూచించడంతో అక్కడి ప్రజలు తట్టా బుట్టా సర్థుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియక వలస బాట పట్టారు.

పాలస్తీన్లకు ఇజ్రాయెల్ హెచ్చరికలు..

ఇక స్థానిక పౌరుల సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా గాజాలో నేలకూలిన భవనాల లెక్కలను వెల్లడించింది. 1324 నివాసానికి అనుకూలంగా ఉన్న భవనాలు, నివాసయోగ్యం కాని భవనాలు రెండూ ఇజ్రాయెల్ వైమానిక దాడులలో కుప్పకూలాయి. ప్రత్యేకంగా నిర్మించిన 5540 హౌసింగ్ యూనిట్లు పూర్తిగా భూగర్భంలో కలిసిపోయాయి. 3743 నివాసాలైతే మరమ్మత్తులు చేసినా కూడా నివసించేందుకు వీలుకాని విధంగా తయారయ్యాయి. ఆఫీస్ ఆఫ్ కో ఆర్డినేషన్ ఆఫ్ హ్యూమానిటేరియన్ అపైర్స్ అయితే 55వేల నిర్మాణాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు ప్రకటించింది.

T.V.SRIKAR