తెలంగాణ బీజేపీ (Telangana BJP) లో లోక్ సభ అభ్యర్థుల టిక్కెట్ల లొల్లి నడుస్తోంది. బీజేపీ హైకమాండ్ శనివారం నాడు తెలంగాణలోని 9 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ లిస్ట్ పై బీజేపీ లీడర్ల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో అసమ్మతి చెలరేగుతోంది. ఫస్ట్ లిస్టులో టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న వారు నిరాశ పడ్డారు. కొంతమంది పార్టీ ఆఫీసు ముందు నిరసనకు దిగారు. ఒకరిద్దరు నేతలు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ టిక్కెట్ మాధవీ లతకు ఇవ్వడంపై… MLA రాజాసింగ్ (Raja Singh) అభ్యంతరం చెప్పారు. హైదరాబాద్ ఎంపీ (Hyderabad MP) సీటుకు పోటీ చేయడానికి మగాడు ఎవరూ దొరకలేదా అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. తనకు ఈ లోక్ సభ నియోజకవర్గం టిక్కెట్ ఇస్తారని రాజాసింగ్ ఆశపడ్డారు. లేదంటే సికింద్రాబాద్ సీటు అయినా ఇవ్వాలని కోరుకున్నారు. కానీ లిస్ట్ లో మాధవీలత పేరు ఉండటంపై రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ ఎల్పీ పదవి ఇవ్వలేదని రాష్ట్ర, కేంద్ర బీజేపీ (Central BJP) నాయకత్వాల అలిగారు రాజాసింగ్. ఆయన బీజేపీ విజయ్ సంకల్ప యాత్రల్లో కూడా పాల్గొనడం లేదు.
మల్కాజ్ గిరి టిక్కెట్ ను ఈటల రాజేందర్ కు కేటాయించడంపై స్థానికుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఇక్కడి నుంచి పోటీకి చాలామంది ప్రయత్నించారు. దాదాపు నాలుగేళ్ళుగా బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు కూడా ఎదురు చూస్తున్నారు. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో పార్టీ ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్తున్నారు. అయినా అధిష్టానం తనకు కాకుండా ఈటల రాజేందర్ కు ఇవ్వడంతో X లో తన నిరాశను ప్రకటించారు మురళీధర్ రావు. నియోజకవర్గంలో ఎంతో చేశా… అయినా ఫలితం దక్కలేదు అన్నట్టుగా ట్వీట్ చేశారు.
ఇదే సీటును ఈటలకు ఇవ్వొద్దంటూ కూన శ్రీశైలం గౌడ్ (Srisailam Goud) అభ్యంతరం చెబుతూ వచ్చారు. స్థానిక నేతలకే ఇవ్వాలి. నాన్ లోకల్ అభ్యర్థులకు ఇవ్వొదంటూ… ఈమధ్య మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని బీజేపీ నేతలతో కలసి ఆయన మీటింగ్ కూడా పెట్టారు. ఇప్పుడు ఈటలకు ఇవ్వడంతో కూన శ్రీశైలం గౌడ్ బీజేపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి… కాంగ్రెస్ లో చేరతారని అంటున్నారు. శ్రీశైలం గౌడ్ 2021లో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ హస్తం పార్టీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి.
జహీరాబాద్ ఎంపీ టిక్కెట్ బీబీ పాటిల్ కు ఇవ్వడంపైనా స్థానికంగా నిరసన వస్తోంది. మాజీ మంత్రి బాగా రెడ్డి కొడుకు జైపాల్ రెడ్డి ఈ టిక్కెట్ ఆశించారు. బీబీ పాటిల్ పేరు ప్రకటించగానే జైపాల్ రెడ్డి అనుచరులు బీజేపీ స్టేట్ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముందే నిరసన తెలిపారు. బీజేపీ ఫస్ట్ లిస్టులో తన పేరు లేకపోవడంపై డీకే అరుణ ఆశ్చర్యపోతున్నారు. మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీచేయాలని ఆమె అనుకుంటున్నారు. అరుణకు ఫస్ట్ లిస్ట్ లో బీజేపీ అధిష్టానం టిక్కెట్ ప్రకటించలేదు. పాలమూరు సీటు కోసం జితేందర్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు.
తనకు బీజేపీ ఎంపీ టిక్కెట్ ఇస్తానంటేనే… పార్టీలో చేరినట్టు జితేందర్ రెడ్డి చెబుతున్నారు. మరి పాలమూరు ఎంపీ టిక్కెట్ ఎవరికి ఇస్తారు. డీకే అరుణ లేదంటే జితేందర్ రెడ్డి… వీళ్ళిద్దరూ కాకుండా రాష్ట్ర పార్టీ కోశాధికారి శాంతకుమార్ కి ఇస్తారా ? ఫస్ట్ లిస్టులో పేరు లేకపోవడం మాత్రం డీకే అరుణకు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. తెలంగాణలో నలుగురు సిట్టింగ్స్ లో ముగ్గురుకి మళ్ళీ అవకాశం ఇచ్చింది బీజేపీ అధిష్టానం. కానీ ఆదిలాబాద్ ఎంపీ టిక్కెట్ మళ్ళీ సోయం బాపూరావుకు ఇవ్వలేదు. ఆయనకు సెకండ్ లిస్టులో కూడా డౌటే అంటున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోనూ బీజేపీలో అసంతృప్తి కనిపిస్తోంది. ఇప్పుడు చెలరేగిన అసంతృప్తి లోక్ సభ ఎన్నికల దాకా ఉంటుందా… అధిష్టానం వాళ్ళని బుజ్జగిస్తుందా చూడాలి.