Shivaji Maharaj: భారత్‌కు తిరిగి రానున్న ఛత్రపతి శివాజీ ఆయుధం

మొఘల్‌ సామ్రాజ్యాన్ని అంతమొందించి హిందుత్వాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన ఛత్రపతి శివాజీ జీవితం భారత దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయం. అలాంటి మహావీరుడు వాడిన ఓ ఆయుధం ఎట్టకేలకు భారత్‌కు తిరిగిరానుంది.

  • Written By:
  • Publish Date - October 2, 2023 / 12:40 PM IST

శతృవును చెండాడే ధీరుడు, వంద మందిని చంపగల యోధుడు. ఇలాంటి మాటలకు మానవ రూపం ఇస్తే ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అవుతారు. శివాజీ న్యాయనిరతి, పోరాట స్పూర్తి అనన్యసామాన్యం. అంతటి వీరుడు కాబట్టే.. ఇప్పటికీ ఛత్రపతి పోరాటాన్ని తల్చుకుంటే ప్రతీ ఒక్కరి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మొఘల్‌ సామ్రాజ్యాన్ని అంతమొందించి హిందుత్వాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన ఛత్రపతి శివాజీ జీవితం భారత దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయం. అలాంటి మహావీరుడు వాడిన ఓ ఆయుధం ఎట్టకేలకు భారత్‌కు తిరిగిరానుంది. ఛత్రపతి శివాజీ 17వ శతాబ్ధంలో ఉపయోగించిన పులి గోళ్లను తిరిగి భారత్‌కు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం లండన్‌లోని విక్టోరియా అండ్‌ ఆల్బర్ట్‌ మ్యూజియంలో ఈ ఆయుధం ఉంది. శివాజీ పట్టాభిషేకం జరిగి ఈ ఏడాదితో 350 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ ఆయుధాన్ని తిరిగి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.

కాకపోతే ఇది శాశ్వతంగా భారత్‌లో ఉండదు. మూడేళ్లపాటు పలు ప్రాంతాల్లో ప్రదర్శన నిర్వహించి తిరిగి మళ్లీ లండన్‌కు పంపేస్తారు. ఈ మేరకు మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి లండన్‌లోని మ్యూజియం అధికారులతో ఒప్పందం చేసుకున్నారు.1659లో జరిగిన యుద్ధంలో బీజాపూర్‌ సైన్యానికి చెందిన కమాండర్‌ అఫ్లజ్‌ఖాన్‌ను శివాజీ ఈ ఆయుధం ఉపయోగించే చంపారని చరిత్రకారులు చెప్తున్నారు. ఆ తర్వాత ఆ ఆయుధం 1818లో సతారా స్టేట్‌కు ఈస్టిండియా కంపెనీ తరఫున రెసిడెంట్‌ అధికారిగా ఉన్న జేమ్స్‌ గ్రాంట్‌ డఫ్‌ ఆధీనంలోకి వెళ్లిందని.. అతని వారసుల ద్వారా వీ అండ్‌ ఏ మ్యూజియానికి చేరిందని తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ ప్రయత్నాల తరువాత ఇప్పుడు ఆ ఆయుధం భారత్‌కు రానుంది.