Minister KTR: అసంతృప్తులతో కేటీఆర్ భేటీ వెనుక ఆంతర్యమేంటి.. పార్టీని వీడతారా.. కొనసాగుతారా..?

తెలంగాణలో బీఆర్ఎస్ విజయానికి కలిసి పనిచేయాలని అసంతృప్తులతో సాగిన భేటీ ఫలించినట్లేనా.. కేటీఆర్ స్పష్టమైన హామీతో అభ్యర్థుల మధ్య సఖ్యత కుదిరినట్లేనా.. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు, అసంతృప్తులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Publish Date - September 23, 2023 / 08:50 AM IST

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేటీఆర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణ ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో పార్టీలో అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇందులో భాగంగానే తాజాగా కడియం శ్రీహరి, రాజయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి, చల్మెడ, చెన్నమనేని తో భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించే పనిలో ఉన్నారు సీఎం కేసీఆర్. మ్యానిఫెస్టో రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి సీనియర్ నాయకులతో కలిసి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 16న వరంగల్ వేదికగా జరిగే భారీ బహిరంగ సభలో తమ మ్యానిఫెస్టో ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నాయకులు. అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ ఇద్దరూ పార్టీని మూడవసారి అధికారంలోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.

తాటికొండలో కుదిరిన సఖ్యత..

అందులో భాగంగానే తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరితో ప్రగతి భవన్ సాక్షిగా భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ రాజయ్య ఎమ్మెల్యే టికెట్ ను కడియం శ్రీహరికి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కొంత కాలంగా రాజయ్య పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా కేటీఆర్ తో జరిగిన మీటింగ్లో టికెట్ రానందుకు చింతించవద్దని బీఆర్ఎస్ పార్టీ  అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో శ్రీహరి విజయానికి దోహదపడి పార్టీ విజయానికి సహకరించమని కోరినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రస్థాయిలో గౌరవప్రదమైన పదవిని ఇస్తామని రాజయ్యకు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కడియం విజయానికి సహకరిస్తానని తెలిపారు రాజయ్య. ఇద్దరి మధ్య సఖ్యత కుదరడంతో స్టేషన్ ఘన్ పూర్ లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమాను వ్యక్తం చేశారు.

వేములవాడలో వచ్చిన స్పష్టత..

వేములవాడ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చెన్నమనేని రమేష్ స్థానంలో చెల్మెడ లక్ష్మీ నరసింహారావుకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. దీంతో రమేష్ వర్గంలోని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో ప్రగతి భవన్ కి రావాలని రమేష్ కి ఆహ్వానం పంపినా ఆయన తిరస్కరించి హాజరు కాలేదు. దీంతో ఆయనకు కేబినెట్ ర్యాంకు స్థాయిని కల్పిస్తూ వ్యవసాయరంగ సలహాదారునిగా సీఎం నియమించారు. ఇలా చేయడం వల్ల అక్కడి వర్గాల్లో ఉన్న అసంతృప్తి తగ్గుతుందని భావించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ సీన్ రివర్స్ అయి పదవిని తిరస్కరించారు. తాజాగా కేటీఆర్ తో జరిగిన సమావేశంలో చల్మెడ రమేష్ కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, కేవలం సాంకేతిక పరమైన సమస్యల కారణంగానే రమేష్ కి టికెట్ ఇవ్వలేదని చెప్పినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో రమేష్ కు మరిన్ని అవకాశాలు ఇస్తుందని హామీ ఇవ్వడంతో రమేశ్ వర్గీయులు శాంతించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వేములవాడ లో కేసీఆర్ జెండా ఎగురవేస్తామని తెలిపారు.

జనగామలో వర్గపోరుకు అడ్డుకట్ట

ఇక జనగామలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ హేమాహేమీలు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. అందులోనూ వర్గపోరు తారా స్థాయిలో ఉండటంతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అక్కడి కీలక నేతలతో సమావేశమయ్యారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య సఖ్యత కుదిర్చేందుకు కృషి చేశారు. ముత్తి రెడ్డి కి టికెట్ ఏ కారణంగా ఇవ్వలేదో వివరించారు. ఇందుకు గానూ మరో గౌరవప్రదమైన పదవిని ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్దంగా ఉన్నట్లు కేటీఆర్ ముత్తిరెడ్డితో మాట్లాడినట్లు తెలుస్తోంది. సాక్షాత్తు కేటీఆర్ నచ్చజెప్పడంతో ముత్తిరెడ్డి వర్గేయులు అసంతృప్తి వీడి పల్లా విజయానికి సహకరిస్తానని చెప్పినట్లు సమాచారం. ఇలా అసంతృప్తి నేతలను దగ్గరకు పిలిపించి కచ్చితమైన హామీ ఇవ్వడంతో లైన్ క్లియర్ అయినట్లు తెస్తోంది.

ఇలా అసంతృప్తులను పార్టీ వీడకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో రేపు ఎన్నికల్లో విజయానికి వీరు ఎంతమేర కృషి చేస్తారో వేచి చూడాలి.

T.V.SRIKAR