Revanth Reddy: ఉచిత విద్యుత్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ చేజేతులా నాశనం చేసుకుంటోందా ?

కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయ్. పొంగులేటి చేరికతో కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరినట్లు అయింది. బీఆర్ఎస్‌, కాంగ్రెస్ మధ్య టగ్ ఆఫ్ వార్ ఖాయం అనుకుంటున్న సమయంలో.. రేవంత్ మాటలు ఇప్పుడు సీన్‌ మళ్లీ మొదటికి తీసుకొచ్చేలా కనిపిస్తున్నాయ్. రైతులకు ఉచిత విద్యుత్‌ విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయ్.

  • Written By:
  • Publish Date - July 11, 2023 / 01:28 PM IST

తానా మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన రేవంత్ రెడ్డి.. అక్కడ కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలను మీట్ అయ్యారు. ఈ సందర్బంగా ఉచిత పథకాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాలకు అనవసరంగా ఉచిత పథకాలు అందిస్తున్నారని.. అలా ఇవ్వొద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. కేసీఆర్ అనవసరంగా రైతులకు 24గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారని.. రైతులకు కేవలం 3గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయ్. రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయ్. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తే తప్పేంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉచిత పథకాలు అమలు చేయడం లేదా అని ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు అధికార బీఆర్ఎస్‌కు ఆయుధంగా మారాయ్‌. రాష్ట్రవ్యాప్తంగా గులాబీ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. రేవంత్ ప్రకటనకు నిరసనగా అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని భావిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఇప్పుడిప్పుడు ఆశలు మొదలయ్యాయ్. రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్‌ మీద జనాల్లో వ్యతిరేకత మొదలైంది. దీనికితోడు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లే చాలామందిపై రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయ్. దీంతో బీఆర్ఎస్‌ నేతల్లో చాలామంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.

ఇక ఎన్నికలు రావడమే ఆలస్యం సత్తా చాటుదామని కాంగ్రెస్ నేతలు అనుకుంటుంటే.. ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలను పార్టీని మళ్లీ వెనక్కి నెట్టేస్తాయేమో అనే చర్చ జరుగుతోంది. రైతు సొంతంగా గెలవలేడేమో.. పార్టీని గెలిపిస్తాడు, ప్రభుత్వాన్ని గెలిపిస్తాడు. అలాంటి రైతును ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ కష్టపడుతుంటే.. రేవంత్ మాత్రం రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంటలు రేపుతున్నాయ్. ఇది కచ్చితంగా హస్తం పార్టీకి దెబ్బగా మారడం ఖాయం అనిపిస్తోంది.