Revanth Reddy: కేసీఆర్‌కు ఝలక్ ఇచ్చేలా రేవంత్ వ్యూహం

తెలంగాణలో పూర్తిగా మారిపోయింది పొలిటికల్ సీన్. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్‌ అన్నట్లు కనిపించిన యుద్ధం.. కర్ణాటక ఫలితాల తర్వాత మారిపోయింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా మారింది. అసంతృప్తులు అగ్రనేతలంతా హస్తం పార్టీ వైపు చూస్తుండడంతో.. పోరు మరింత ఆసక్తికరంగా మారింది ఇప్పుడు.

  • Written By:
  • Publish Date - June 18, 2023 / 02:08 PM IST

ఇలాంటి సమయంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా భారీ వ్యూహాన్ని రచిస్తోంది కాంగ్రెస్‌. ఉద్యమం రోజులు గుర్తు చేసేలా.. నిజమైన ఉద్యమకారులు వీళ్లే అంటూ కొందరిని ప్రొజెక్ట్ చేసి.. కేసీఆర్‌ను ఇరుకుపెట్టాలన్నది హస్తం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ కోసం పాటుపడిన ఉద్యమకారులకు భారీ వల వేస్తోంది కాంగ్రెస్. ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినవాళ్లను.. మొదటి నుంచి కేసీఆర్‌తో పనిచేసి ఇప్పుడు దూరంగా ఉన్నవాళ్లు పార్టీలో చేర్చుకోవాలని రేవంత్‌ స్ట్రాటజీ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అందరి లక్ష్యం ఒకటే అంటూ.. కేసీఆర్‌ మీద వ్యతిరేకత ఉన్న వారందరినీ ఒకేతాటి మీదకు తీసుకురాబోతున్నారు.

ఇప్పటికే ఇందిరా శోభన్, కోదండరాం, గద్దర్‌లాంటి వారికి ఆహ్వానం పంపిన కాంగ్రెస్‌.. మరికొందరికి వల విసురుతోంది. గులాబీ పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలకు గాలం వేస్తోంది. టీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి చేరికలతో మంచి రోజులు మొదలుకాబోతున్నాయనే ప్రచారం మొదలుపెట్టింది. వీరితో పాటు.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్, మాజీ ఎంపీ వివేక్‌ లాంటి ముఖ్య నేతలతోనూ తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది.

ఇక అటు బీజేపీలో ఉన్న ఉద్యమకారులు రాణి రుద్రమ, జిట్టా బాలకృష్ణారెడ్డిలాంటి లీడర్లనకు కూడా ఆహ్వానం పంపే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదేమోనని టెన్షన్‌తో అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్‌ నేతలను కూడా కాంగ్రెస్‌లోకి చేర్చుకునేందుకు హస్తం పార్టీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. ఇక గ్రౌండ్‌లెవల్‌లో పార్టీని యాక్టివ్ చేసేందుకు.. మరింత బలం పెంచేందుకు.. ముందుగా క్షేత్రస్థాయిలోని నాయకులను పార్టీలోకి లాగాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. అసంతృప్తితో ఉన్న ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలతో పాటుగా మండలస్థాయిలో ఉన్న రకరకాల కమిటీల నాయకులకు కండువా కప్పాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది కాంగ్రెస్‌. రేవంత్ ఇప్పుడు ఇదే పని మీద ఉన్నారు. కేసీఆర్‌కు ఊహించని షాక్ ఇచ్చే స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నారనే ప్రచారం వినిపిస్తోంది.