బర్రెలక్క (Barrelakka) అలియాస్ కర్ని శిరీష (Sirisha) మొన్నటి దాకా ఆమె అంటే సంచలనం. ఇప్పుడు కొత్తగా ఓ వ్యక్తి గురించి ప్రమోషన్ చేసి ఇబ్బందుల్లో పడింది. బర్రెలక్కా బర్రెలు కాచుకో… అంటూ ఆమెను తెగ ట్రోల్ (Trolls) చేస్తున్నారు నెటిజెన్స్. ఎవరో ఒక గురువు గారిని కలసి జాతకాలు చూపించుకోవాలనీ… ఆయనకు వశీకరణ తెలుసు. ఆయన దగ్గర సమస్యలు పరిష్కారం అవుతాయి… అంటూ ఫేస్ బుక్ లో పెట్టిన వీడియోపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
బర్రెలక్క అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరేమో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) ఉద్యోగాల (Unemployed) భర్తీలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ… బర్రెలు కాచుకుంటున్నట్టు వీడియో తీసి సోషల్ మీడియా (Social media) లో పెట్టి ఫేమస్ అయింది. ఈ బర్రెలక్క ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయింది. నిరుద్యోగుల తరపున నామినేషన్ వేసి 5 వేలకు పైగా ఓట్లు తెచ్చుకోవడం విశేషం. ఆమె ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ ను దాదాపు లక్ష మంది డౌన్లోడ్ చేసుకున్నారంటే బర్రెలక్కకు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానంటోంది బర్రెలక్క అలియాస్ శిరీష.
కానీ ఈమధ్య బర్రెలక్క విడుదల చేసిన ఓ వీడియో వివాదస్పదంగా మారింది. మీకు రెగ్యులర్ గా ఓ గురువు గారి గురించి చెబుతా కదా… ఆయన్ని కలిశాను అని మొదలుపెడుతూ ఓ వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఆయన చాలా బిజీ అనీ… వశీకరణ విద్య బాగా తెలుసనీ… సమస్యలతో బాధపడే చాలామంది ఆయన దగ్గరకు వచ్చి జ్యోతిష్యం చెప్పించుకుంటారు. మీరూ ప్రయత్నించండి అంటూ ఆ గురువు మొబైల్ నెంబర్ కూడా పోస్ట్ చేసింది. నా కాంట్రాక్ట్ నెంబర్ కోసం మీరు గురువుని అడుగుతున్నారట… మీ టైమ్ వేస్ట్ చేసుకోకండి… నా మొబైల్ నెంబర్ ఆయన దగ్గర లేదంటూ వీడియోలో తెలిపింది. తమ గురువు గారు వశీకరణ స్పెషలిస్ట్ అంటూ బర్రెలక్క చేసిన వీడియోపై నెటిజెన్స్ మండిపడుతున్నారు. మూఢ నమ్మకాలను ప్రమోట్ చేస్తావా అంటూ బర్రెలక్కపై మండిపడుతున్నారు.
ఇలాంటి వీడియోలు ప్రమోట్ చేస్తే… నీ విలువ పోతుందనీ… మీ నియోజకవర్గంలో సమస్యలు ఉంటే వీడియోలు తియ్యి… లేదంటే విద్యపై జనంలో అవగాహన తీసుకురా… అని కొందరు కామెంట్ చేస్తే… బర్రెలైనా కాచుకో గానీ… ఇలాంటి తప్పుడు ప్రమోషన్లు చేయొద్దని మరికొందరు మండిపడుతున్నారు. బర్రెలక్క ప్రపంచానికి అజ్ఞానం నేర్పుతోందనీ… ఇలాంటి వాళ్ళని ఎన్నికల్లో అనవసరంగా ప్రమోట్ చేశారని కొందరు ఫైర్ అయ్యారు. ఈసారి లోక్ సభకు పోటీ చేస్తున్నావ్ కదా… ప్రధాన మంత్రి పదవి కావాలని మీ గురువుగారితో వశీకరణ చేయించుకో… అందరూ నీకే ఓట్లేసేలా ఓటర్లను వశీకరణ చేయించు… అని ఓ నెటిజన్ ఘాటుగా మెస్సేజ్ పెట్టాడు. అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు గెలిచేటట్టుగా మీ గురువు ఎందుకు చేయలేదని మరికొందరు ప్రశ్నించారు.
మూఢ నమ్మకాలు, మంత్రాలు, తంత్రాలు, వశీకరణల పేరుతో మోసాలు చేసే దొంగ బాబాలకు బర్రెలక్క సపోర్ట్ చేస్తోందని సోషల్ మీడియాలో దెమ్మెత్తి పోస్తున్నారు. జనం ఇంత పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నా… ఆ వీడియో మాత్రం ఇంకా సోషల్ మీడియా నుంచి తొలగించలేదు బర్రెలక్క.