తెలంగాణ పాలిటిక్స్‌లో ట్రబుల్ షూటర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు.. హరీష్ రావు. సమస్య ఏదైనా, ఎలాంటిదైనా.. ఒక్కసారి ఆయన అడుగుపెట్టారో.. పరిష్కారం అడ్రస్ వెతుక్కుంటూ వస్తుందని రాజకీయాల్లో టాక్. ఆయన ఆలోచన ఎంత పదునుగా ఉంటుందో.. మాట అంటే స్ట్రాంగ్‌గా వినిపిస్తోంది. మాటల యుద్ధంలో ఆయనను ఓడించడం కాదు కదా.. పోటీ పడడం కూడా కష్టమే. తెలంగాణ అసెంబ్లీలో ఇప్పుడు అదే సీన్ కనిపిస్తోంది. హరీష్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు సీన్ కనిపిస్తోంది. ఒక్కొక్కరు కాదు.. అందరు ఒకేసారి వచ్చినా సమస్యే లేదు అన్నట్లుగా.. కాంగ్రెస్ సర్కార్ ఆరోపణలను, విమర్శలను తిప్పికొడుతున్నారు హరీష్. అధికారం కోల్పోయిన తర్వాత.. బీఆర్ఎస్ శ్రేణులు నిరాశలో మునిగాయ్. కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూనే..
కాంగ్రెస్ ఆరోపణలకు తన మార్క్ ఆన్సర్లు ఇస్తున్నారు హరీష్. ఎవరికి అర్థమయ్యే భాషలో వారికి సమాధానం చెప్పాలి అన్నట్లుగా.. అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా విరుచుకుపడుతున్నారు. ఇచ్చిన హామీల సంగతేంటని నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున డిఫెండ్ చేస్తూనే.. కాంగ్రెస్ మీద ఎటాకింగ్ స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో… హరీష్ మాటలకు కేటీఆర్, కేసీఆర్ కూడా ముచ్చట పడిపోయారంటే.. అర్థం చేసుకోవచ్చు ఈ ట్రబుల్ షూటర్ దూకుడు ఏంటా అని! బడ్జెట్ మీద ప్రసంగంలోనూ తగ్గేదే లే అన్నట్లు హరీష్ మాటలు వినిపించాయ్. సీఎం రేవంత్ పాటు.. మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క.. ఇలా ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా.. ప్రతీ దానికి ఆన్సర్ ఇచ్చాడు.
ప్రతీ సమాధానంతో మరో ప్రశ్నకు కాంగ్రెస్ మీదకు తోశారు. ఎనీవేర్ సింగిల్ హ్యాండ్.. హరీష్ అనే రేంజ్‌లో రెచ్చిపోయారు. సెటైర్లు, పంచ్‌లు, విమర్శలు, ఆరోపణలు.. తన మాట పవర్ ఏంటో అసెంబ్లీ సాక్షిగా మళ్లీ పరిచయం చేశారు. బీఆర్ఎస్ వరకు రావాలి అంటే.. ముందు తనను దాటాలి అనే రేంజ్‌లో పార్టీని డిఫెండ్ చేసినట్లు కనిపించారు హరీష్. తన తర్వాత తనంత నాయకుడు అని.. అప్పుడెప్పుడో హరీష్‌ను ఉద్దేశించి కేసీఆర్ ఓ మాట అన్నారు. అది నిజం.. అదే నిజం అని.. ఇప్పుడు అసెంబ్లీలో హరీష్ స్పీచ్ చూసిన ప్రతీ ఒక్కరు ప్రశంసలు గుప్పిస్తున్నారు.