TS CETs 2024: తెలంగాణలో ప్రతి ఏటా వివిధ విద్యా సంస్థల్లో కోర్సుల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఎంసెట్‌తోపాటు లాసెట్, ఈసెట్, పీజీసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీజీఈ సెట్‌కు సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం సాయంత్రం తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అయితే.. ఎంసెట్ పేరును.. ‘టీఎస్ ఈఏపీసెట్ (EAPCET)’గా మారుస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.
Nitish Kumar: ఇండియా కూటమికి మరో షాక్.. బీజేపీకి దగ్గరవ్వనున్న నితీష్..
తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మే 6 ఈసెట్, మే 9 నుంచి 13 వరకు ఈఏపీసెట్ (ఎంసెట్), మే 23న ఎడ్‌సెట్, జూన్ 3న లాసెట్, జూన్ 4, 5 తేదీల్లో ఐసెట్, జూన్ 6 నుంచి 8 వరకు పీజీఈసెట్, జూన్ 10 నుంచి 13 వరకు పీఈసెట్ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్, జేఈఈ వంటి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఉన్నత విద్యామండలి ఈఏపీసెట్ (ఎంసెట్) షెడ్యూలు ఖరారుచేసింది. ప్రస్తుతానికి షెడ్యూల్, సెట్లు నిర్వహించే సంస్థల వివరాలు మాత్రమే విడుదలయ్యాయి. అర్హతలు, రిజిస్ట్రేషన్ ఫీజు, దరఖాస్తు ప్రక్రియ షెడ్యూల్, నియామకం, సీట్ల భర్తీ వంటి ఇతర వివరాలతో కూడిన నోటిఫికేషన్‌లను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారు.
వివిధ సెట్ల వివరాలివి..
♦ మే 9 నుంచి 11 వరకు ఈఏపీసెట్ (ఎంసెట్) ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష, మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మాసీ ప్రవేశ పరీక్ష జరుగుతుంది. జేఎన్టీయూ హైదరాబాద్ ఈ పరీక్ష నిర్వహిస్తుంది.
♦ టీఎస్ ఈసెట్ ప్రవేశ పరీక్ష మే 6న జరుగుతుంది. దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది.
♦ బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష మే 23న జరుగుతుంది. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహిస్తుంది.
♦ తెలంగాణలోని లా కాలేజీల్లో 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘టీఎస్ లా సెట్ 2024 పరీక్ష’ జూన్ 3న జరుగుతుంది. పీజీ.. లా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ టెస్టు కూడా అదే రోజు జరుగుతుంది. లాసెట్, పీజీ ఎల్‌సెట్‌లను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది.
♦ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ‘టీఎస్ ఐసెట్’ ప్రవేశ పరీక్ష జూన్ 4, 5 తేదీల్లో జరుగుతుంది. కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టు జరుగుతుంది.
♦ ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఉద్దేశించిన టీఎస్ పీజీఈసెట్ పరీక్ష జూన్ 6 నుంచి 8 వరకు జరుగుతుంది. హైదరాబాద్ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరుగుతుంది.
♦ బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘టీఎస్ పీఈసెట్’ పరీక్ష జూన్ 10 నుంచి 13 వరకు జరుగుతుంది. శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.