Sajjanar: భాగ్యనగర రోడ్లపైకి రానున్న 50 ఎలక్ట్రిక్ బస్సులు.. సరికొత్త ఫీచర్లు ఇవే..!

హైదరాబాద్ రోజుకో పర్యాటకంతో.. సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటుంది. ఈ తరుణంలోనే సిటీలో ఎలక్ట్రిక్ బస్సులను నగర రహదారులపై తిప్పేందుకు ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 02:58 PM IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రయాణికులకు 25 ఎలక్ర్టిక్‌ ఏసీ బస్సులు త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ బస్‌భవన్‌ ప్రాంగంణంలో కొత్త ప్రొటో నమూనా ఎలక్ట్రిక్  ఏసీ బస్సును టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ సోమవారం సాయంత్రం పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఒలెక్ర్టా గ్రీన్‌టెక్‌ కంపెనీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆ సంస్థలో పనిచేసే సిబ్బందికి పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కాగా, గ్రేటర్‌లో తొలిదశలో 50 ఎలక్ర్టిక్‌ ఏసీ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని గతంలోనే ఆర్టీసీ నిర్ణయించింది.

ఎయిర్ పోర్టుకు 20, ఐటీ కారిడార్ లో 30 

వాటిలో 20 శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో, మరో 30 ఐటీ కారిడార్‌లో నడపనున్నారు. దీంతో ఎయిర్ పోర్ట్ కు వెళ్లేవారికి మరిన్ని బస్సులు అందుబాటులోకి రావడం ద్వారా ప్రయాణీకులు క్యాబ్ కు చెల్లించే డబ్బులు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఐటీ కంపెనీల్లో పనిచేసే సాప్ట్ వేర్ ఉద్యోగుల సౌకర్యార్థం వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.  మొత్తం 50 బస్సుల్లో 25 బస్సులు తొలిదశలో భాగంగా అతి త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

TSRTC New Electric Bus

సరికొత్త ఫీచర్లు.. సౌకర్యవంతమైన ప్రయాణం

బస్సు ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. సుమారు 12 మీటర్ల పొడవుండే ఈ ఎలక్ర్టిక్‌ ఏసీ బస్సుల్లో 35 సీట్లుంటాయి. ఇందులో మొబైల్‌ చార్జింగ్‌ సౌకర్యంతో పాటు సీటు బెల్ట్‌ సదుపాయం ఉంటుంది. బస్సులో మూడు సీసీ టీవీ కెమెరాలుంటాయి. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్ మూడ్ ఆప్షన్ ను ఏర్పాటు చేశారు. ఇవి 100శాతం ఎకో ఫ్రెండ్లీ బస్సులు వీటి వల్ల పర్యావరణానికి ఎలాంటి కాలుష్యముప్పు ఉండదని సంస్థ అధికారులు తెలిపారు. సురక్షితం, సౌకర్యవంతంగా నగరవాసులకు ప్రయాణసౌకర్యాలు అందించడమే తమ లక్ష్యం అని సజ్జనార్ అన్నారు.

T.V.SRIKAR