TSPSC ఛైర్మన్ పదవికి బి.జనార్ధన్ రెడ్డి చేసిన రాజీనామాను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నాక జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రిజైన్ లెటర్ ను గవర్నర్ కు అందించారు. అయితే జనార్ధన్ రెడ్డిని పేపర్ లీక్స్ కు బాధ్యుడిని చేస్తూ DOPTకి గవర్నర్ తమిళిసై లెటర్ రాశారు. అందువల్ల ఈ లీక్స్ కు బాధ్యులెవరో తేల్చకుండా రాజీనామా ఆమోదించరాదని గవర్నర్ నిర్ణయించారు. గవర్నర్ నిర్ణయంతో జనార్ధన్ రెడ్డి రాజీనామా ఎపిసోడ్ అర్థంతరంగా ఆగిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ని నియమించింది. అయితే జనార్ధన్ రెడ్డి హయాంలో TSPSC పేపర్లు లీక్ అయ్యాయి. జేఈ, గ్రూప్స్ పేపర్స్ ను TSPSC ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బందే లీక్ చేశారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసి… ఎంక్వైరీ జరిపించింది. సిట్ పోలీసులు లీక్స్ కు బాధ్యులైన కమిషన్ ఆఫీసులోని సిబ్బందితో పాటు లక్షల రూపాయలకు అమ్ముకున్న కొందరు అభ్యర్థులు, మధ్యవర్తులను కూడా అరెస్ట్ చేశారు. అయితే పేపర్స్ లీకేజీ విషయంలో కమిషన్ కు ఛైర్మన్ గా ఉండి బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన బి.జనార్ధన్ రెడ్డిపైగానీ, సంబంధిత ప్రభుత్వం అధికారులపైగానీ పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దీనిపై నిరుద్యోగులు చాలా సీరియస్ గా ఉన్నారు. అధికారులను తప్పించడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చూసిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో జనార్ధన్ రెడ్డి రాజీనామాను ఆమోదిస్తే….TSPSC పేపర్ లీక్స్ కి ఎవరు బాధ్యులు అవుతారని గవర్నర్ తమిళిసై భావించారు. రేవంత్ సర్కార్ రావడంతో ఛైర్మన్ జనార్థన్ రెడ్డి ముందుగా రాజీనామా చేయగా, TSPSC సభ్యులు కూడా అదేబాటలో నడుస్తారని తెలిసింది. ఇప్పుడు జనార్ధన్ రెడ్డి రిజైన్ ను గవర్నర్ నిలిపివేయడంతో… సభ్యులు ఎలాంటి స్టెప్ తీసుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది.