FREE BUS RIDE: ఫ్రీ బస్సులో వెళ్లే మహిళలకు అలర్ట్.. ఇకపై ఈ రూల్స్ పాటించాల్సిందే..!

మహిళలు కొన్ని రూల్స్ పాటించాల్సిందే అని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. బస్సుల్లో ప్రయాణించాలంటే ఇకపై ఒరిజినల్ గుర్తింపు కార్డుల్ని మాత్రమే చూపించాలని సజ్జనార్ తెలిపారు. జిరాక్స్ కాపీలు అనుమతించబోమన్నారు.

  • Written By:
  • Publish Date - December 20, 2023 / 08:14 PM IST

FREE BUS RIDE: మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలవుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తెచ్చిన ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. అయితే, ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే మహిళలు కొన్ని రూల్స్ పాటించాల్సిందే అని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. బస్సుల్లో ప్రయాణించాలంటే ఇకపై ఒరిజినల్ గుర్తింపు కార్డుల్ని మాత్రమే చూపించాలని సజ్జనార్ తెలిపారు. జిరాక్స్ కాపీలు అనుమతించబోమన్నారు.

PALLAVI PRASHANTH: బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్.. హైదరాబాద్ తరలింపు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్, పాన్ కార్డు వంటి గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్లను తీసుకోవాలని మహిళలను కోరారు. కొందరు గుర్తింపు కార్డుల జిరాక్స్ కాపీలను తెస్తున్నారని, స్మార్ట్ ఫోన్‌లలో సాప్ట్ కాపీలు చూపిస్తున్నారని, ఇకపై అలాంటివి చెల్లబోవన్నారు. గుర్తింపు కార్డుల్లోనూ ఫొటోలు స్పష్టంగా ఉండాలన్నారు. ఆధార్ కార్డుల్లో చిన్నప్పటి ఫొటోలు ఉన్నాయని, వాటిని అప్‌డేట్ చేసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర మహిళలకే ఈ పథకం వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా ఛార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలని సజ్జనార్ సూచించారు. ఉచిత ప్రయాణమే కదా అని.. మహిళలు జీరో టికెట్లు తీసుకోకుండా ఉంటే కుదరదని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ జీరో టికెట్ తీసుకోవాలని కోరారు. జీరో టికెట్‌ల ఆధారంగానే ఆ ఛార్జీని టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రీయంబర్స్ చేస్తుందని వెల్లడించారు.

ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో రాబోయే నాలుగైదు నెలల్లో దాదాపు 2050 కొత్త బస్సులు తీసుకొస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. అందులో 1050 డీజిల్ బస్సులు, 1000 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోందని తెలిపారు. ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 3 కోట్ల మంది మహిళలు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్లు తెలిపారు.