TSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు

నిజానికి ఏపీకి ఎక్కువ బస్సులు నడపాల్సి ఉంది. కానీ, మహాలక్ష్మి పథకంతో మహిళలు గతంలోకంటే ఎక్కువగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో తెలంగాణ మహిళా ప్రయాణికులకు ప్రాధాన్యం ఇచ్చిన ఆర్టీసీ.. తెలంగాణకే అధిక బస్సులు కేటాయించింది.

  • Written By:
  • Publish Date - January 6, 2024 / 02:34 PM IST

TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సందర్భంగా 4,484 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ఇది గత ఏడాది నడిపిన సంక్రాంతి బస్సులకంటే దాదాపు 200 అధికం. అయితే, తెలంగాణ నుంచి ఏపీకి మొత్తంగా 1,500 ప్రత్యేక బస్సులు అవసరం అని ఆర్టీసీ భావించింది. కానీ, 600 బస్సుల్ని మాత్రమే అందుబాటులోకి తిప్పింది. సంక్రాంతి స్పెషల్ బస్సులు జనవరి 7, ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.

Ambati Rayudu  : పొలిటికల్‌ ఇన్నింగ్స్‌కు అంబటి రాయుడు గుడ్‌ బై

నిజానికి ఏపీకి ఎక్కువ బస్సులు నడపాల్సి ఉంది. కానీ, మహాలక్ష్మి పథకంతో మహిళలు గతంలోకంటే ఎక్కువగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో తెలంగాణ మహిళా ప్రయాణికులకు ప్రాధాన్యం ఇచ్చిన ఆర్టీసీ.. తెలంగాణకే అధిక బస్సులు కేటాయించింది. ఏపీకి తక్కువ సర్వీసుల్నే నడుపుతోంది. తెలంగాణ మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉన్న సంగతి తెలిసిందే. దీంతో మహిళలు ప్రైవేటు వాహనాలు బదులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. దీంతో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఈసారి ఎక్కువ బస్సులు నడపబోతుంది ఆర్టీసీ. అలాగే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేకంగా కేటాయించిన 4,484 బస్సుల్లో ొ626 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు వీసీ సజ్జనార్ తెలిపారు. అలాగే పల్లెవెలుగు, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి.

మరోవైపు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టెంట్లు, కుర్చీలు, మంచి నీళ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులు కూడా విధులు నిర్వర్తిస్తారు. ఇక.. ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయరు. ఇప్పటివరకు ఉన్న సాధారణ చార్జీలే వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఈ నెల 7 నుంచి 15 వరకు ప్రత్యేక బస్సులు తిరుగుతాయని వెల్లడించింది సంస్థ.