TTD BOARD: టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు.. వారి దర్శనాలపై పరిమితి

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని భాష్యకార్ల సన్నిధిలోని మకర తోరణానికి, శ్రీ పార్థసారథిస్వామి, శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి తిరువాభరణాలకు బంగారు పూత పూసేందుకు ఆమోదం లభించింది.

  • Written By:
  • Publish Date - March 11, 2024 / 04:25 PM IST

TTD BOARD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సమావేశం సోమవారం జరిగింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ పాలకమండలి తీసుకున్న కీలక నిర్ణయాలివి. తిరుమల క్వార్టర్లలో అభివృద్ధి పనులు చేపట్టాలని బోర్డు నిర్ణయించింది. అలాగే టీటీడీ నిర్వహిస్తున్న చారిత్రక ఆలయాల్లో అభివృద్ధి పనులను శ్రీవాణి ట్రస్టు తరఫున చేపట్టబోతున్నారు.

Rishabh Pant: పంత్ తిరిగొస్తున్నాడు.. ఐపీఎల్‌లో ఆడేందుకు లైన్ క్లియర్

టీటీడీ ఆధ్వర్యంలో 15 చారిత్రాత్మక, పురాతన ఆలయాలు, 13 టీటీడీ నిర్మించిన ఆలయాలు, 22 ఆధీనంలోకి తీసుకున్న ఆలయాలు ఉన్నాయి. టీటీడీ పాలక మండలి సభ్యులు పరిమిత సంఖ్యలో స్వామివారి దర్శనానికి రావాలని సూచించారు. ఇష్టానుసారం దర్శనానికి రావటం సరికాదని, దీనివల్ల సాధారణ భక్తులకు ఇబ్బందులు కలుగుతోందని, దర్శనాల్ని పరిమితం చేసుకోవాలని భూమన సూచించారు. ఇకపై.. కుటుంబ సభ్యులతో తక్కువసార్లు వస్తేనే దర్శనానికి అవకాశం ఉంటుందన్నారు. ఇతరులతోవస్తే అనుమతించటంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని భాష్యకార్ల సన్నిధిలోని మకర తోరణానికి, శ్రీ పార్థసారథిస్వామి, శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి తిరువాభరణాలకు బంగారు పూత పూసేందుకు ఆమోదం లభించింది. స్విమ్స్‌ ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం 479 నర్సు పోస్టులు క్రియేట్‌ చేసేందుకు ఆమోదం తెలిపారు. గ‌తంలో చాలామంది నోటిఫికేష‌న్‌, రూల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్‌ (ఆర్‌వోఆర్) ద్వారా కాకుండా బోర్డు ఆమోదంతో ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోసం తీసుకున్న కాంట్రాక్టు/పొరుగుసేవ‌ల ఉద్యోగుల‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

జి.ఓ.నం.114 ప్ర‌కారం కొన్ని నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించి వారి సేవ‌లు క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు ప్ర‌భుత్వానికి నివేదిక పంపాల‌ని నిర్ణ‌యించారు. రూ.1.88 కోట్లతో తిరుమలలో భక్తుల సౌకర్యార్థం పిఏసి-1లో 10 లిఫ్టులు ఏర్పాటుకు టెండరు ఆమోదం లభించింది. టీటీడీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఎలాంటి సిఫారసు లేకుండా హాస్టల్‌ వసతి కల్పించబోతున్నారు. ఇందుకోసం అవసరమైన హాస్ట‌ళ్లు నిర్మించాలని నిర్ణయించారు. రూ.14 కోట్లతో తిరుమలలో టీటీడీ ఉద్యోగుల పాత సి టైప్‌, డి టైప్‌, కొత్త సి టైప్‌, డి టైప్‌ క్వార్టర్లలో మిగిలి ఉన్న 184 క్వార్టర్ల అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. రూ.1.50 కోట్లతో బాలాజి నగర్‌ తూర్పువైపున, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం ఔటర్‌ కార్డన్‌ ప్రాంతంలో మిగిలిపోయిన ఫెన్సింగ్‌ ఏర్పాటుకు ఆమోదించారు.