TURKEY EARTH QUAKE: టర్కీని కుదిపేసిన భూకంపం శిధిలాలలో చిక్కుకున్న వేలమంది ప్రజలు

  • Written By:
  • Publish Date - February 6, 2023 / 05:07 AM IST

అంకారా: టర్కీ (Turkey), సిరియా (Syria)లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం (EarthQuake) సంభవించి పలు నగరాల్లో వందలాది భవనాలు కుప్పకూలాయి. ఈ ప్రళయంలో ఇప్పటి వరకు 90 మందికి పైగా మృతిచెందగా.. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అక్కడి సమయం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది. భూకంప రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైనట్లు యూఎస్‌ (USA) జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. టర్కీలోని గాజియాన్‌తెప్‌ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం సంభవించిన పావుగంట తర్వాత 6.7తీవ్రతతో మరోసారి శక్తిమంతమైన ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రకృతి విళయతాండవం చేయడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు టర్కీలో 53, సిరియాలో 42 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయినట్లు తెలిపారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్లు చెబుతున్నారు. టర్కీలోని మలట్యా, ఉర్ఫా, ఒస్మానియో, దియర్‌బకీర్‌ ప్రాంతాల్లో భూకంప ప్రభావం అధికంగా ఉంది. సిరాయాలో అలెప్పో, హమా, లటాకియాలో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇళ్లు నేలమట్టమైన ఫొటోలు భూకంప తీవ్రతను తెలియజేస్తున్నాయి.

భూమిలో ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు సాధారణంగా భూమి కంపించడం చూస్తూ ఉంటాం. అయితే టర్కీ (Turkey)లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2020 జనవరిలో ఇలాజిగ్‌ ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించి 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది అక్టోబరులో 7.0 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 114 మంది మృత్యువాతపడ్డారు. ఇక, 1999లో టర్కీ చరిత్రలో అత్యంత భీకర ప్రకృతి బీభత్సాన్ని చవిచూసింది. ఆ ఏడాది 7.4తీవ్రతతో భూకంపం సంభించి 17వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఇస్తాంబుల్‌లోనే 1000 మంది మరణించారు.

ఇప్పడు సంభవించిన భూకంపంలో ఎంతమంది చనిపోయారనే విషయం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. శిధిలాల క్రింద ఇరుక్కున్న వారు వందల సంఖ్యలో ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
సంఘటనా స్థలంలో అక్కడి రక్షణశాఖ అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. మృతి చెందిన వారిని గుర్తించి వారి కుటుంబీకులకు అప్పగించే పనుల్లో నిమగ్నమైయ్యారు.