ఆఖరిరోజు ట్విస్టులు, వర్షంతో చివరికి డ్రానే

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్ట్ అనూహ్య పరిణామాల మధ్య డ్రాగా ముగిసింది. ఊహించినట్టుగానే చివరిరోజు వర్షం అంతరాయం కలిగించింది. కానీ ఆఖరిరోజు ట్విస్టులు చోటు చేసుకున్నాయి. తొలి సెషన్ వర్షంతో రద్దవగా... రెండో సెషన్ లో మూడు ఓవర్ల లోపే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.

  • Written By:
  • Publish Date - December 18, 2024 / 05:17 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్ట్ అనూహ్య పరిణామాల మధ్య డ్రాగా ముగిసింది. ఊహించినట్టుగానే చివరిరోజు వర్షం అంతరాయం కలిగించింది. కానీ ఆఖరిరోజు ట్విస్టులు చోటు చేసుకున్నాయి. తొలి సెషన్ వర్షంతో రద్దవగా… రెండో సెషన్ లో మూడు ఓవర్ల లోపే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 260 రన్స్ కు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాకు 185 పరుగుల ఆధిక్యం దక్కింది. తర్వాత ఉత్సాహంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కంగారూలకు భారత బౌలర్లు షాకిచ్చారు. ఊపిరి ఆడనివ్వకుండా బంతులను సంధించారు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్టే వెనుదిరిగాడు. ఏ ఒక్కరు కూడా లోయర్ మిడిలార్డర్‌లో ట్రావిస్ హెడ్, వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ, కేప్టెన్ పాట్ కమ్మిన్స్ మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగలిగారు.

ట్రావిస్ హెడ్ 17, అలెక్స్ కేరీ 19 , పాట్ కమ్మిన్స్ 22 పరుగులు చేశారు. ఓపెనర్లు నాథన్ మెక్‌స్వీనీ 4, ఉస్మాన్ ఖవాజా 8, మార్నుస్ లాంబుషేన్ 1, మిఛెల్ మార్ష్ 2, స్టీవెన్ స్మిత్ 4, మిఛెల్ స్టార్క్ 2 పరుగులు చేశారు. ఒక దశలో ఆస్ట్రేలియా 33 పరుగులకు ఏకంగా అయిదు వికెట్లను కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్ లో వేగంగా పరుగులు చేసే క్రమంలో ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయింది. మొదటి నుంచీ ఆ టీమ్ బ్యాటర్లు ధాటిగా ఆడేందుకు ప్రయత్నించారు. చివరికి హెడ్ , కమ్మిన్స్ , క్యారీ బ్యాటింగ్ తో 89 పరుగులకు ఇన్నింగ్‌ను డిక్లేర్ చేసింది. బుమ్రా 3, సిరాజ్, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు తీశారు.ఈ మ్యాచ్ లో ఫలితం కోసం ఆ టీమ్ సాహసమే చేసింది. కానీ వర్షంతో దానికి ఫలితం లేకుండా పోయింది.

తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని భారత్ ముందు 275 రన్స్ టార్గెట్ ను ఉంచింది. ఈ లక్ష్యచేధనకు టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించగా.. వర్షం అంతరాయం కలిగించింది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ వికెట్ కోల్పోకుండా 8 రన్స్ చేసింది. టీ బ్రేక్ తర్వాత భారీ వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. తొలి రోజు మొదలైన వర్షం చివరి రోజు వరకూ కొనసాగడంతో ఫలితం సాధ్యం కాలేదు. మ్యాచ్ మొత్తం ఐదు రోజుల్లో కేవలం 216 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. చివరి రోజు అయితే మొత్తంగా 24 ఓవర్లే వేయగలిగారు. తొలి టెస్టులో భారత్ గెలిస్తే… రెండో టెస్టులో ఆసీస్ విజయం సాధించింది. గబ్బా టెస్ట్ డ్రా తర్వాత ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.