ఉత్తరకొరియా ఎప్పుడూ చూడని ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జనాలు ఆకలితో అలమటించి పోతున్నా.. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ మాత్రం.. విలాసాల విషయంలో తగ్గేదే లే అంటున్నాడు. ఈ నియంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని.. యూకే రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. అతడు తాగే మద్యం బాటిల్ ధరే అది చెప్తుందని వివరించారు. కిమ్ 7వేల డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 5లక్షల రూపాయల విలువ చేసే లిక్కర్ తాగుతాడని తెలిపారు. అతడికి అవసరమైన విలాసవంతమైన మద్యం బ్రాండ్ల దిగుమతికే ఏటా 30 మిలియన్ డాలర్లు.. అంటే 247 కోట్లు ఖర్చు చేస్తారని చెప్పారు.
ఇక తనకు ఇష్టమైన బ్రెజిలీయన్ కాఫీ కోసం ఏటా 9.6 లక్షల డాలర్లను కిమ్ ఖర్చు చేస్తున్నాడు. ఇక అతను తాగే సిగరెట్లు.. గోల్డ్ రేకుతో చుట్టి ఉంటాయ్. కిమ్ మద్యంతోపాటు.. తినేందుకు ఇటలీలో ప్రత్యేకంగా తయారు చేసే పర్మా హామ్, స్విస్ చీజ్‌ను కూడా దిగుమతి చేసుకుంటున్నాడు. నగరం తగలబడిపోతుంటే.. ఫిడేల్ వాయించుకున్నట్లు.. ఉత్తరకొరియా ఆకలి కోరల్లో చిక్కుకొని అల్లాడుతుంటే.. ఈ నియంత మాత్రం విలాసాల విషయంలో భారీ ఖర్చు చేస్తున్నాడు. చైనా నుంచి ఎరువులు, ఆహారోత్పత్తికి అవసరమైన పరికరాలతోపాటు ధాన్యాల దిగుమతి కూడా ఉత్తరకొరియా నిలిపేసింది. దీంతో రెండున్నర కోట్ల జనాభా ఉన్న ఉత్తర కొరియాలో పంట దిగుబడి లేక ఆహార సంక్షోభం మొదలైంది.