టాలెంట్ తోనే జాక్ పాట్, కోట్లు పలికిన అన్‌క్యాప్డ్ ప్లేయర్లు

ఐపీఎల్ మెగావేలం చాలా మంది యువ క్రికెటర్లను ఎన్నోసార్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసింది.. ఈ లీగ్ లో సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికై స్టార్ క్రికెటర్లుగా మారిపోయిన ఆటగాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఒక్కసారి కూడా జాతీయ జట్టుకు ఆడకుండానే కోట్లు కొల్లగొట్టిన ఆటగాళ్ళు ఈ సారి కూడా మెగావేలంలో కనిపించారు.

  • Written By:
  • Publish Date - November 27, 2024 / 05:53 PM IST

ఐపీఎల్ మెగావేలం చాలా మంది యువ క్రికెటర్లను ఎన్నోసార్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసింది.. ఈ లీగ్ లో సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికై స్టార్ క్రికెటర్లుగా మారిపోయిన ఆటగాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఒక్కసారి కూడా జాతీయ జట్టుకు ఆడకుండానే కోట్లు కొల్లగొట్టిన ఆటగాళ్ళు ఈ సారి కూడా మెగావేలంలో కనిపించారు. మెగా వేలం కావడంతో అంతర్జాతీయ ఆటగాళ్ళ కంటే అన్ క్యాప్డ్ యువ ఆటగాళ్ళకే డిమాండ్ పెరిగింది. నేహాల్ వధేరా నుండి నమన్ ధీర్ వరకు చాలా మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కోటీశ్వరులుగా మారారు. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది రసిక్ సలాందార్ గురించే.. ఐపీఎల్ 2025 వేలంలో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా రసిక్ సలాందార్ నిలిచాడు. 30 లక్షల బేస్ ప్రైస్ ఉన్న రసిక్ ను ఆర్సీబీ 6 కోట్లకు కొనుగోలు చేసింది. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఈ యువ పేస్ బౌలర్ దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నాడు. టీ ట్వంటీ కెరీర్ లో 36 వికెట్లు తీశాడు.

అలాగే ఐపీఎల్ లో పెద్దగా అవకాశాలు దక్కని నమన్ ధీర్ ను ముంబై ఇండియన్స్ భారీ మొత్తంతో కొనుగోలు చేసింది.. మెగా వేలంలో 30 లక్షల బేస్ ప్రైస్ తో వచ్చిన అతన్ని దక్కించుకోవడానికి ఆర్సీబీ, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ పోటీ పడ్డాయి. కానీ ముంబై అతన్ని 5.25 కోట్లకు దక్కించుకుంది. ఈ కుడిచేతి వాటం టాపార్డర్ బ్యాటర్ దేశవాళీ టీ ట్వంటీల్లో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే గత సీజన్ వరకూ సన్ రైజర్స్ కు ఆడిన అబ్దుల్ సమద్ కూడా వేలంలో జాక్ పాట్ కొట్టాడు. 2020 నుంచి 2024 వరకు సన్ రైజర్స్ కు ఆడిన సమద్ పలు మెరుపు ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకూ ఐపీఎల్ లో 140కి పైగా స్ట్రైక్ రేట్ తో 577 పరుగులు చేశాడు. ఈ యువ హిట్టర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ 4.2 కోట్లు వెచ్చించింది.

కాగా గత రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన నేహాల్ వధేరా రెండుసార్లు తొలిసారి కోట్లలో ధర పలికాడు. గతంలో 20 లక్షలే అందుకున్న వధేరా తన బ్యాటింగ్ స్కిల్స్ తో ఫ్రాంచైజీలను ఆకట్టుకున్నాడు. ఈసారి అతను జాక్ పాట కొట్టాడు. అతన్ని పంజాబ్ కింగ్స్ 4.20 కోట్లకు కొనుగోలు చేసింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ తరఫున 11 మ్యాచ్ లలో 189 పరుగులు చేసిన అశుతోష్ కు 167కు పైగా స్ట్రైక్ రేట్ ఉంది. ఫినిషర్ పాత్రను పోషించిన అశుతోష్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 3.80 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే ఐపీఎల్ 2024లో ఆకట్టుకున్న అంగ్‌క్రీష్ రఘువంశీని కోల్‌కతా నైట్ రైడర్స్ 3 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఢిల్లీ ప్రీమియర్ లీగ్ పలు సంచలన ఇన్నింగ్స్ లతో దుమ్మురేపిన ప్రియాన్ష్ ఆర్య కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీగా తలపడ్డాయి. అన్ క్యాప్డ్ ఆటగాళ్ల జాబితాలో ప్రియాన్ష్ శర్మ ఏకంగా రూ.3.8 కోట్లకు అమ్ముడుపోయాడు. మొత్తం మీద దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ఆటతీరుతో వీరంతా జాతీయ జట్టుకు ఆడకుండానే ఐపీఎల్ లో కోటీశ్వరులయ్యారు.