ఎన్నో సంవత్సరాలుగా మహిళల భావాలను, తన గొంతును, అభిప్రాయాలను దేశానికి తెలిపే సువర్ణావకాశానికి నేడు నాంది పలుకనుంది. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనం సాక్షిగా కొత్త మహిళా బిల్లును తీసుకువచ్చేందుకు ఎన్టీఏ కూటమిలోని బీజేపీ ప్రయత్నిస్తోంది. పూర్తి ఎన్నికల స్టంట్ గా కొందరు చెబుతున్నప్పటికీ అందులో ఏఏ అంశాలు పొందుపరిచారో స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఇది మహిళలకు ఈ బిల్లు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
1996 లోనే వెలుగులోకి వచ్చింది..
చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా కొన్ని వర్గాల్లో వినిపిస్తున్న ముందస్తు సమాచారం ఆధారంగా వెలుగులోకి వచ్చింది. ఎన్నో ఎళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించిందని చెప్పాలి. రాజకీయంగా మహిళలకు పెద్దపీట వేయడం ద్వారా రాజకీయ స్వరూపంతో పాటూ ముఖచిత్రం కూడా మారబోతుంది. మహిళా అభిప్రాయాలు వ్యక్తపరిచేందుకు ఒక వేదిక లభించినట్లైంది. యునైటెడ్ ఫ్రెంట్ లోని దేవెగౌడ ప్రభుత్వం 1996, సెప్టెంబర్ 2న ఈ బిల్లును తొలిసారి ప్రవేశపెట్టింది. అయినప్పటికీ ఈ బిల్లు అప్పట్లో లోక్ సభలో ఆమోదం పొందలేదు. తిరిగి 2010 రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. అదే బిల్లు తిరిగి లోక్ సభకు వచ్చిన తరువాత ఆమోదం పొందలేదు. 1998 వాజ్ పేయ్ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రకటించినప్పటికీ అనేక ఆటంకాలు ఎదుర్కొంది. 1999, 2002, 2003లో ప్రవేశ పెట్టినప్పటికీ బిల్లును ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత వచ్చిన మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న యూపీఏ ప్రభుత్వం 2008 మే 6వ తేదీన రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టారు. స్టాండింగ్ కమిటీకి పంపిన తరువాత 2009 డిశంబర్ లో తిరిగి ప్రభుత్వానికి పంపారు. 2010లో కేంద్ర కేబినెట్ ఆమోదం పొంది రాజ్యసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ లోక్ సభ తిరిగి పరిశీలనలోకి తీసుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎవరూ దానిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజాగా ప్రవేశపెట్టే బిల్లు గతంలో ఆమోదం పొందకుండా వదిలేసిందా.. లేక కొత్తగా సవరణలు చేసి తీసుకొచ్చారా అనేది తెలియాల్సి ఉంది.
మూడింట ఒక వంతు మహిళలదే..
ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెడితే కనీసం 14 రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంటుంది. ఎందుకంటే 28 రాష్ట్రాల్లో సగం మంది ఆమోదిస్తేనే దీనికి జీవం ఉంటుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ ఉంది. ఒక వేళ చట్టసభల్లో ఈ బిల్లు పాసైతే అసెంబ్లీ, లోక్ సభలో మూడింట ఒక వంతు సీట్లు కేవలం మహిళలకే కేటాయించాల్సి ఉంటుంది. దీంతో పురుషులకు సమానంగా స్త్రీలు పోటీకి వస్తారన్న ఉద్దేశ్యంతోనే ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకేదన్నవాదనలు వినిపిస్తున్నాయి. లోక్ సభ, అసెంబ్లీలకు సంబంధించి కేటాయించిన సీట్లను పార్లమెంట్ నియమించిన అధారిటీ నిర్ణయిస్తుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ లకు కేటాయించే సీట్లలో మూడింట ఒక వంతు సీట్లను ఆయావర్గాలకు మాత్రమే కేటాయించాల్సి ఉంటుంది. లోక్ సభతో పాటూ అన్ని అసెంబ్లీలకు ఇది వర్తిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రొటేషన్ ప్రకారం రిజర్వుడు నియోజకవర్గాల వారిగా సీటు కేటాయింపు ఉంటుంది. చట్టం అమలులోకి వచ్చిన తరువాత రొటేషన్ ప్రకారం మూడు దఫాలుగా అన్ని స్థానాలకు వర్తించేలా దీనిని తీసుకురానున్నారు. సుమారు 15ఏళ్ల కాల పరిమితితో ఈ రిజర్వ్డ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఏకకాలంలో ఒకసారి రిజర్వ్ చేసిన సీట్లను మళ్లీ రిపీట్ చేయకూడదు.
కేబినెట్ ఆమోదించినా.. చట్టసభల్లోనే స్ఫష్టత
ఈనిర్ణయాన్ని కేబినెట్లో ప్రతిపాదించినప్పటకీ ఆ అంశాలను మీడియా ముఖంగా తెలిజేయకూడదు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. కేంద్ర కేబినేట్ లో తీసుకున్న ఏ నిర్ణయమైనా సభాముఖంగానే చెప్పాలి. ముందుగా దీనిని అడ్వైజరీ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ తరువాత స్పీకర్ ఓంబిర్లా సమక్షంలో అందులోని అంశాలను చర్చించేందుకు అవకాశం కల్పిస్తారు. ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల ఆధారంగా ఏ పార్టీకి ఎంత సమయం ఇవ్వాలి అనేది నిర్ణయిస్తారు.
T.V.SRIKAR