కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున ఆమె కట్టుకొని వచ్చే చీరలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఈసారి తెలుపు, మెజెంటా రంగు చీరలో వచ్చి బడ్జెట్ ప్రసంగం చదివారు. ఆ చీరపై ప్రత్యేకత ఏంటని అందరూ ఆసక్తిగా చూశారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్… వరుసగా ఏడోసారి పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. జనరల్ గా బడ్జెట్ అంటే… కొత్త వరాలు, కీలక ప్రకటనలు, కేటాయింపులపైనే దృష్టి ఉంటుంది. కానీ గత ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు… నిర్మలా సీతారామన్ ధరించే చీరలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. దేశ సంస్కృతీ సంప్రదాయాలను ఇష్టపడే నిర్మల ఎక్కువగా చేనేత చీరలను ఇష్టపడతారు. ఈసారి కూడా హ్యాండ్లూమ్ శారీలోనే వచ్చి.. బడ్జెట్ ప్రసంగం చదివారు. తెలుగు, బంగారం రంగులో మోటిఫ్ తో ఉన్న మెజెంటా బోర్డర్ కలిగిన సిల్క్ చీరలో కనిపించారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన కాంత ఎంబ్రాయిడరీతో తయారు చేసిన టస్సార్ సిల్క్ శారీ ఇది. గోల్డెన్ బ్యాంగిల్స్, చైన్, చిన్న చెవిపోగులు ధరించగా.. వీటిల్లో సంప్రదాయ హస్తకళ కనిపించింది.
గతంలో ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చీరల విషయంలో ప్రత్యేకత చూపించారు. 2019లో ఫస్ట్ టైమ్ ఫైనాన్స్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత….ఫిబ్రవరి 1న తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు. కాంతా చీరలో కనిపించారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు ప్రతీకగా ‘రామా బ్లూ’ రంగు చీరను నిర్మల కట్టుకున్నారు. ఈ చేనేత చీరపై గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతి ఎంబ్రాయిడరీ కనిపించింది. ఆ తర్వాత అదే ఏడాది ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు… మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు నిర్మలా సీతారామన్. 2020లో ‘ఆస్పిరేషనల్ ఇండియా’ థీమ్‌కు తగ్గట్టుగా నీలం రంగు అంచులో పసుపుపచ్చ – బంగారు రంగులో ఉన్న చీరకట్టులో కనిపించారు. 2021లో ఎరుపు – గోధుమ రంగు కలిసిన భూదాన్ పోచంపల్లి చీర కట్టుకున్నారు. 2022లో ఒడిశాకు చెందిన చేనేత చీర మెరూన్ రంగు శారీని ధరించారు నిర్మలా సీతారామన్. అలాగే 2023లో బ్రౌన్ రంగులో టెంపుల్ బోర్డర్‌లో ఎరుపు రంగు చీరతో కనిపించారు. ప్రతి బడ్జెట్ కు నిర్మాలా సీతారామన్ కట్టుకునే చీరకు స్పెషాలిటీ ఉంటోంది. సంప్రదాయ చీరలకు ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో చేనేత కళను ప్రోత్సహించినట్టు అవుతుందని బీజేపీ లీడర్లు చెబుతున్నారు.