నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్ర మంత్రి కుమారస్వామి సందర్శించనున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు విశాఖ ఉక్కు కర్మాగారం పైనే ఉంది. ఈరోజు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించి.. ప్లాంట్ పనితీరు, ఆర్థిక పరిస్థితులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆ తర్వాత అధికారులు, కార్మిక సంఘాలతో ఆయన భేటీ కానున్నారు. నిన్న సాయంత్రమే ఆయన విశాఖ చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తల నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా దాదాపు మూడు సంవత్సరాలకు పైగా విశాఖ ఉక్కు ఉద్యోగుల ఆందోళన చేస్తున్నారు. తమకు జీతాలు సరిగా ఇవ్వడం లేదని.. నిర్వహణకు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉందని స్టిల్ ప్లాంట్ అధికారులు వెల్లడించారు. కేంద్ర పర్యటనతో మంత్రి ఏం మాట్లాడుతారో.. సెయిల్‌లో విలీన ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారింది. కాగా ఇదివరకే ఏపీ బీజేపీ ఎంపీలు కేంద్ర ఉక్కుమంత్రి కుమారస్వామిని కలిశారు. స్టీల్ ప్లాంట్‌పై ఇక్కడ ప్రజల ఆకాంక్షలు, ప్రైవేటీకరణ విషయాన్ని వెనక్కి తీసుకోవాలని కుమారస్వామిని కోరారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో, రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్‌ను విలీనం చేయడం వల్ల రెండు కంపెనీలు లాభపడతాయని వారు కుమారస్వామికి వివరించారు.