Air Pollution: ఢిల్లీలో నివసించాలంటే దశాబ్ధంపైగా ఆయుష్షును వదులుకోవాల్సిందే.. డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోంది..?

దేశ రాజధాని ఢిల్లీ లో బ్రతకాలంటే మన 11 సంవత్సరాల ఆయుష్షును ధారబోయాల్సిందే అంటున్నాయి నివేదికలు. దీనికి కారణాలు ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Publish Date - August 30, 2023 / 07:54 AM IST

మన సమాజంలో రోజురోజుకూ కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే చెప్పనవసరం లేదు. ప్రతి రోజూ వాహన కాలుష్యంతో పాటూ చుట్టుపక్కల ఉండే పరిశ్రమల్లోని వ్యర్థల ద్వారా కూడా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపై తాజాగా యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచినట్లు నివేదికలో పేర్కొంది. ఇక్కడ బ్రతకాలంటే తమ ఆయుర్ధాయాన్ని ఒక దశాబ్ధానికి కుదించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. వాయునాణ్యత జీవన సూచీలో తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడి ప్రజలు 11 సంవత్సరాలా 9నెలల జీవన ప్రాయాన్ని కోల్పోవల్సి ఉంటుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన దానికంటే కూడా అధిక కాలుష్యం ఉందని వివరించింది. మన దేశంలో ఢిల్లీ నగరం ఒక్కటే కాకుండా ఇతర ప్రాంతాలతో కలుపుకొని 67.4 శాతం మంది ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకొని జీవిస్తున్నట్లు నివేదిక సారాంశం. కేవలం పీఎం 2.5 అంటే అతి సూక్ష్మాతి సూక్ష్మ ధూళి కణాల కాలుష్యం ద్వారానే దేశ ప్రజల సరాసరి ఆయుష్షు 5సంవత్సరాలా 3నెలలు తగ్గిపోతున్నట్లు వెలుగులోకి వచ్చింది. మిగిలిన భాగం నదుల్లో కలిసే వ్యర్థాలు, పరిశ్రమల వాయుకాలుష్యం, నగరాల్లో తిరిగే వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా జీవన ప్రమాణాన్ని కోల్పోతున్నట్లు తెలిపింది. ప్రభుత్వాలు సరి, బేసి విధానంలో రోడ్లపై వాహనాలు తిరిగేలా కొత్త ప్రణాళికలు తెచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది.

అధిక కాలుష్య నగరాలు ఇవే..

ఢిల్లీ లో నివసించే 1.8 కోట్ల మంది తమ 11.9 ఏళ్ల ఆయుర్ధాయాన్ని కోల్పోవల్సి వస్తే.. దీనికి సమీపంలో ఉన్న పంజాబ్ లోని పఠాన్ కోట్ 3.1 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోతున్నారు. దీనికి కారణం వాతావరణంలో ఉండే పీఎం స్థాయి నిల్వలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇది ఇలాగే కొనసాగితే క్రమక్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించి అక్కడి ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. మన దేశంతో పాటూ బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, నైజీరియా, ఇండోనేషియా లో నివసించే ప్రజలు కూడా ఈ కాలుష్యం కారణంగా ఆరు సంవత్సరాల జీవన ప్రాయాన్ని కోల్పోతున్నాట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది.

T.V.SRIKAR