విదేశీ ప్లేయర్ గా ఉన్ముక్త్ చాంద్, వేలంలో భారత మాజీ కెప్టెన్

ఐపీఎల్ మెగా వేలానికి ఇంకా ఐదురోజులే టైముంది. సౌదీ అరేబియన్ సిటీ జెడ్డా వేదికగా నవంబర్ 24,25 తేదీల్లో ఆటగాళ్ళ మెగా ఆక్షన్ జరగనుండగా.. ఇప్పటికే ప్లేయర్స్ షార్ట్ లిస్ట్ కూడా వచ్చేసింది. 10 ఫ్రాంచైజీల్లోని 204 స్థానాల కోసం 574 మంది పోటీ పడనున్నారు.

  • Written By:
  • Publish Date - November 19, 2024 / 06:16 PM IST

ఐపీఎల్ మెగా వేలానికి ఇంకా ఐదురోజులే టైముంది. సౌదీ అరేబియన్ సిటీ జెడ్డా వేదికగా నవంబర్ 24,25 తేదీల్లో ఆటగాళ్ళ మెగా ఆక్షన్ జరగనుండగా.. ఇప్పటికే ప్లేయర్స్ షార్ట్ లిస్ట్ కూడా వచ్చేసింది. 10 ఫ్రాంచైజీల్లోని 204 స్థానాల కోసం 574 మంది పోటీ పడనున్నారు. ఇందులో 366 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 208 మంది ఓవర్‌సీస్ ప్లేయర్లు ఉన్నారు. మరో ముగ్గురు అసోసియేట్ నేషన్స్‌కు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. భారత్‌కు చెందిన 318 మంది అనామక ఆటగాళ్లు ఈ జాబితాలో చోటు దక్కించుకోగా.. 12 మది అన్‌క్యాప్‌డ్ ఓవర్‌సీస్ ప్లేయర్లు ఉన్నారు. 70 ఓవర్‌సీస్ స్లాట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ సారి వేలంలో పలు ఆసక్తికర విశేషాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. గతంలో భారత అండర్ 19 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన ఉన్ముక్త్ చాంద్ ఈ సారి విదేశీ ప్లేయర్స్ కోటాలో ఐపీఎల్ వేలానికి సిద్ధమయ్యాడు. విరాట్ కోహ్లీ తర్వాత అండర్19 వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ గా ఘనత సాధించిన ఉన్ముక్త్ చంద్‌కి చాలా త్వరగానే మంచి క్రేజ్ ఫాలోయింగ్ వచ్చాయి. టీమిండియాలోకి రాకముందే ధోనీ, యువీ, కోహ్లీలతో కలిసి ఓ యాడ్ కూడా చేశాడు. అయితే ఐపీఎల్‌లో, దేశవాళీ టోర్నీల్లో ఫెయిల్ కావడంతో టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు.

ఎంత ఎదురుచూసినా సెలక్టర్లు పట్టించుకోకపోవడంతో 2021 ఆగస్టులో బీసీసీఐకి గుడ్ బై చెప్పేసి అమెరికాకి మకాం మార్చేశాడు. మైనర్ లీగ్ క్రికెట్, మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీల్లో ఆడిన ఉన్ముక్త్ చంద్, మూడేళ్లుగా యూఎస్‌ఏ తరుపున ఆడాలని కలలు కంటున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో అమెరికా తరపున బరిలోకి దిగలేకపోయినప్పటకీ ఐపీఎల్ 2025 మెగా వేలానికి షార్ట్ లిస్టులో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో భారత ప్లేయర్‌గా ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ టీమ్స్‌కి ఆడిన ఉన్ముక్త్ చంద్.. ఈ సారి వేలంలో అమ్ముడైతే ఫారిన్ ప్లేయర్‌గా తిరిగి లీగ్ లోకి సరికొత్తగా ఎంట్రీ ఇస్తాడు. ఇదే జరిగితే భారత ప్లేయర్‌గా ఆడి, తిరిగి ఫారిన్ ప్లేయర్‌గా ఐపీఎల్‌ ఆడిన క్రికెటర్‌గా ఉన్ముక్త్ చరిత్ర సృష్టిస్తాడు.

మెగా వేలంలో ఉన్ముక్త్ చంద్ 30 లక్షల బేస్ ప్రైజ్‌తో అసోసియేట్ దేశానికి చెందిన ప్లేయర్ గా రిజిస్టర్ చేసుకున్నాడు. వేలంలో ఉన్ముక్త్ చంద్ ను ఫ్రాంచైజీలు పట్టించుకుంటాయో లేదో చూడాలి. ఇదిలా ఉంటే పాకిస్తాన్‌లో పుట్టి, అమెరికాలో సెటిలైన యూఎస్‌ఏ క్రికెటర్ ఆలీ ఖాన్ కూడా ఐపీఎల్ మెగా వేలానికి షార్ట్ లిస్ట్ అయ్యాడు. ఒకవేళ ఆలీ ఖాన్‌ వేలంలో అమ్ముడైతే 16 సీజన్ల తర్వాత ఐపీఎల్ లో ఆడే పాకిస్తాన్ ప్లేయర్ గా నిలుస్తాడు. మరోవైపు మెగావేలంలో 2 కోట్ల కనీస ధరతో 81 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. కోటిన్నర ధరతో 27 మంది, కోటి 25 లక్షలతో 18 మంది, కోటీ రూపాయలతో 23 మంది, 75 లక్షలతో 92 మంది, 50 లక్షలతో 8 మంది, 40 లక్షలతో ఐదుగురు, 30 లక్షలతో 320 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు.