మరి 193 సభ్య దేశాలు ఉన్న ఐక్యరాజ్యసమితి అనుకున్న లక్ష్యాలను సాధించిందా ? ప్రపంచ శాంతి కోసం చేతులు కలిపిన దేశాలు కర్తవ్యాన్ని నిర్వర్తించాయా..? నిజంగా ఐక్యరాజ్యసమితి పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించి ఉంటే.. సిరియా ఎందుకు తగలబడుతుంది.. సూడాన్‌లో ప్రచ్ఛన్న యుద్దం ఎందుకు సాగుతంది..ఉక్రెయిన్ పై రష్యా ఎందుకు దాడి చేస్తుంది ? శాంతికాముకులుగా చెప్పుకునే వాళ్లు.. యుద్ధ రంగంలో ఆరితేరి ఇతర దేశాలపై బాంబులు ఎందుకు వేస్తారు. లక్ష్యాలను సాధించడంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమైందని చెప్పడానికి ఇంతకు మించి ఉదాహరణలు కావాలా ?
సమితి వైఫల్యం పాపం ఎవరిది ?
ప్రపంచశాంతి స్థాపనే ధ్యేయంగా పెట్టుకున్నప్పుడు భాగస్వామ్య దేశాల అభిప్రాయాలకు విలువివ్వాలి. అన్ని దేశాలు కలిసికట్టుగా లక్ష్యాలను చేరుకోవాలి. అందుకు తగ్గ ప్రణాళికలు రచించాలి. కానీ జరుగుతున్నది ఏంటి ? పేరుకే ఐక్యరాజ్యసమితి.. కానీ యూఎన్ ఎప్పుడో కొన్ని దేశాల చేతుల్లో పావుగా మారిపోయింది. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితిపై పెత్తనమంతా భద్రతా మండలిలో ఉన్న ఐదు శాశ్వత సభ్య దేశాలదే. ఈ ఐదు దేశాలకు వీటో అధికారం ఉండటంతో వాళ్లు ఆడిందే ఆటగా సాగిపోతోంది. ప్రపంచ శాంతి, భద్రత, సౌభ్రాతృత్వం అన్న వాటిని ఈ ఐదు దేశాలు ఎప్పుడో గంగలో కలిపేశాయి. పేరు గొప్ప ఊరు దిప్ప అన్నట్టు ఉగ్రవాద, యుద్ధం, వివిధ దేశాల మధ్య కయ్యాలను పరిష్కరించడంలో ఐక్యరాజ్యసమితి ఉత్సవ విగ్రహంలా తయారయ్యింది.
సమితి తీరును ఎండగట్టిన మోదీ
జపాన్‌లో జీ7 సభ్య దేశాల సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ ఐక్యరాజ్యసమితి వైఫల్యాలను తూర్పారపట్టారు. ఐక్యరాజ్యసమితితో పాటు భద్రతామండలిని ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు సంస్కరించకపోతే సమితి తోలుబొమ్మలా మారిపోతుందని హెచ్చరించారు. ప్రపంచశాంతి స్థాపన కోసం ఏర్పాటైన యునైటెడ్ నేషన్స్ ఇప్పటి వరకు ఆ పని ఎందుకు చేయలేకపోతుందని ప్రశ్నించారు. ఉగ్రవాదం, తీవ్రవాదానికి సరైన నిర్వచనాలను కూడా ఆమోదించే స్థితిలో ఐక్యరాజ్యసమితి లేకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. 21వ శతాబ్దంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే విధంగా ఐక్యరాజ్యసమితిలో సమూల మార్పులు చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచ దేశాల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు, యుద్ధాలు నడుస్తున్నప్పుడు వాటిని పరిష్కరించే స్థాయిలో ఐక్యరాజ్యసమితి ఉండాలి తప్ప.. కేవలం మాటలు చెప్పడానికి మాత్రమే సమితి పరిమితమైతే… సమితి అస్థిత్వానికే అర్థం లేదని తేల్చి చెప్పారు. ప్రపంచం శాంతి కోరుకుంటోంది.. యుద్ధాలు నీవారిద్దాం.. ఇలా మాటలు చెప్పడం మానేసి.. ఉక్రెయిన్ -రష్యా లాంటి యుద్ధాలను నివారించి ఉండే ఐక్యరాజ్యసమితి విలువ వచ్చేదని ఆయన స్పష్టం చేశారు.
భద్రతామండలిలో పెత్తనం ఎప్పటికీ వాళ్లదేనా ?
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మొత్తం 15 సభ్యదేశాలు ఉంటే వాటిలో ఐదు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉంది. అమెరికా, రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్.. ఈ ఐదు శాశ్వత సభ్య దేశాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా.. సమితిని నడిపిస్తూ ఉంటాయన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఐక్యరాజ్యసమితికి ఉన్న ఆరు ప్రధాన విభాగాల్లో భద్రతా మండలి ( సెక్యూరిటీ కౌన్సిల్ ) చాలా కీలకమైంది. సమితిలో కొత్తగా ఏదేశానికైనా సభ్యత్వం ఇవ్వాలన్నా..యూఎన్ చార్టర్ లో ఏదైనా మార్పులు చేయాలన్నా భద్రతామండలి ఆమోదం తప్పనిసరి. సెక్రటరీ జనరల్ నామినేషన్ తో సహా ఐక్యరాజ్యసమితి తీసుకునే ఎలాంటి తీర్మానాన్నైనా.. ఒకే ఒక్క వీటో వెనక్కి నెట్టే అధికారం ఐదు సభ్యదేశాలకు ఉంది. శాశ్వత సభ్యదేశాలకున్న ఈ వీటో అధికారమే ఇతరదేశాల ఆగ్రహానికి కారణవుతుంది. తమ ప్రయోజనాలకు భంగం కలుగుతుందనుకుంటే చాలు.. ఎలాంటి తీర్మానాలనైనా వీటో చేసేస్తారు. ఐదు శాశ్వత సభ్యదేశాల్లో ఒక్క దేశం వీటో చేసినా.. ఆ తీర్మానం అటకెక్కేస్తుంది. ప్రస్తుతం భద్రతా మండలిలో ఉన్న సభ్యదేశాలు ప్రపంచ భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టుగా లేవు. ఆఫ్రికాతోపాటు లాటిన్ అమెరికా దేశాలకు ఇప్పటి వరకు సెక్యూరిటీ కౌన్సిల్‌లో సభ్యత్వమే లేదు. పైగా డామినేషన్ మొత్తం యీరోపియన్ దేశాలదే. ఐదు శాశ్వత సభ్య దేశాల్లో మూడు యూరోపిన్ దేశాలే.
భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఎందుకివ్వరు ?
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వమని భారత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. మూడో ప్రపంచ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి ఇతర సభ్యదేశాలు కూడా మద్దతు ప్రకటించాయి. అయితే ఇప్పటికే భద్రతా మండలిపై పెత్తనం చేస్తున్న ఆ ఐదు పర్మినెంట్ నేషన్స్ మాత్రం ముందడుగు పడనివ్వడంలేదు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో సభ్యత్వం చోటు దక్కించుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ సమితి మొత్తాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకున్న భద్రతా మండలిలో చోటు దక్కడం అంటే అంత ఈజీ వ్యవహారం కాదు. అందుకే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా పేరున్నా… ప్రపంచ సంస్థ అయిన ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఇప్పటి వరకు మనకు లేదు. భారత్‌కే కాదు..బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, జర్మనీ, జపాన్ దేశాలు కూడా శాశ్వత సభ్యత్వం కోసం పోరాటం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలితో భారత్ కు విడదీయరాని అనుబంధం ఉంది. UNSC ని స్థాపించినప్పుడు ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. పైగా ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన శాంతి దళాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. 2.5 లక్షల మంది భారతీయ సైనికులు సమితి శాంతి దళాల్లో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఐక్యరాజ్యసమితి 71 గ్లోబల్ పీస్ కీపింగ్ మిషన్స్ ను చేపడితే 49 వాటిల్లో భారత్ పాల్గొంది. వీటన్నింటికీ తోడు భారత్ గ్లోబల్ లీడర్ గా అవతరించింది. అగ్రరాజ్యాలకు తలతన్నేలా అనేక అంశాల్లో దూసుకుపోతోంది. ఇన్ని అర్హతలు ఉన్నా శాశ్వత సభ్యత్వం ఇవ్వకుండా వీటో దేశాలు అడ్డుకుంటున్నాయి.
భద్రతామండలిని అడ్డంపెట్టుకుని ప్రపంచ రాజకీయం
సమితిలో శాశ్వత సభ్యదేశాలుగా ఉన్న అమెరికా, రష్యానే తీసుకుందాం. ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశాలుగా ఉన్నాయంటేనే.. అవి ప్రపంచ శాంతి కోసం అహర్నిశలు పాటుపడాలి. కానీ జరుగుతుంది ఏంటి ? ఉక్రెయిన్ పై రష్యా ఏకపక్షంగా యుద్ధానికి దిగింది. అంతే ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోయాయి. ఉక్రెయిన్ కు మద్దతిస్తూ అమెరికా లాంటి దేశాలు భారీగా ఆయుధాలను సరఫరా చేస్తూ పరోక్షంగా యుద్ధక్షేత్రంలో పాల్గొంటున్నాయి. యుద్ధం ప్రారంభమై సంవత్సరం దాటిపోయినా.. రెండు దేశాల మధ్య రాజీ కుదిర్చి.. శాంతిని స్థాపించడంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమైంది. దీనికి కారణం..శాశ్వత సభ్యదేశాలే యుద్దానికి కారణం కావడం. సిరియా, ఇరాక్ సంక్షోభాలకు కూడా ఈదేశాలే కారణం. ఐక్యరాజ్యసమితి మనుగడ కోసం భారీ స్థాయిలో నిధులు సమకూర్చుతున్న శాశ్వత సభ్యదేశాలు..ప్రపంచ ప్రయోజనాల కంటే.. వాటి ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.
శాశ్వత సభ్యదేశాల తీరుమారాలి
మేం మోనార్కులం..మా మాటే చెల్లుబాటు కావాలంటే..తలాడించే రోజులు కావివి. ప్రపంచంలో ఏ దేశమూ మరోదేశం ఆధిపత్య ధోరణనిని సహించేందుకు సిద్ధంగా లేదు. అందులోనూ ప్రపంచశాంతి కోసం ఏర్పడిన ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యదేశాల ఏకపక్ష వైఖరితో ఇప్పటికే ఇతర దేశాలు విసిగిపోయాయి. న్యూక్లియర్ పవర్స్ గా ఉన్న ఈ ఐదు దేశాలు ప్రపంచ ప్రయోజనాల గురించి ఆలోచించకపోతే.. సమితిలో తిరిగుబాటు జెండా ఎగిరినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే 78 ఏళ్ల క్రితం సమితిని ఏర్పాటు చేసినప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు మెజార్టీ దేశాలు అగ్రరాజ్యాల తీరును నిశితంగా గమనిస్తూనే ఉన్నాయి. సమితితో సంబంధం లేకుండా ముందడుగులు వేసే రోజులు కూడా వస్తున్నాయి. అదే జరిగితే సమితి చాప చుట్టేయాల్సిందే. అలా జరగకుండా ఉండాలంటే.. భారత్ సహా ప్రపంచదేశాలు కోరుకుంటున్న సంస్కరణలను యునైటెడ్ నేషనల్స్
సంస్కరించకుంటే మనుగడే కష్టం
రెండు ప్రపంచ యుద్ధాలు జరిగిన తర్వాత ప్రపంచ దేశాలు శాంతి గురించి ఆలోచించడం మొదలుపెట్టాయి. మరో ప్రపంచ యుద్ధం జరిగితే..మానవ జాతి మనుగడే ప్రమాదంలో పడుతుందని అర్థం చేసుకున్నాయి. అందుకే 1945లో ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గైజేషన్ గా ఐక్యరాజ్యసమితిని ఏర్పాటు చేశారు. అప్పటి ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు , యుద్ధవాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని సమితి ఏర్పాటు జరుగింది. అయితే దశాబ్దాలు గడిచే కొద్దీ ప్రపంచ రాజకీయ ముఖచిత్ర మారిపోయింది. భారత్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు అగ్రరాజ్యాలను ప్రశ్నించే స్థాయికి ఎదిగాయి. అయితే సమితి విధానాల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు సమితి నిర్వాకం నడుస్తోంది. మార్పు ఒక్కటే శాశ్వతమని దానికి తగ్గట్టు మార్పులు చేర్పులతో ముందడుగు వేయాలన్న ఆలోచనను ఐక్యరాజ్యసమితి మర్చిపోయింది. ప్రపంచాన్ని శాంతి మంత్రం బోధించాల్సిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి..అగ్రరాజ్యాలకు కొమ్ముకాస్తు వాళ్ల ప్రయోజనాలను కాపాడుకుంటూ వస్తోంది. 21వ శతాబ్దపు ప్రపంచ అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టుగా అన్ని దేశాల అభిప్రాయాలకు విలువిస్తూ తనను తాను సంస్కరించుకోకపోతే ఐక్యరాజ్యసమితికి మనుగడే కష్టం.
మోదీ సూచించిన బుద్ధ మార్గం
దేశాల మధ్య సమస్య ఎలాంటిదైనా.. తాని తీవ్రత ఎలాంటిదైనా దానికి బుద్ధుడు బోధించిన శాంతి మార్గం ఒక్కటే పరిష్కారం చూపిస్తుందని ప్రధానమంత్రి మోదీ జీ 7 సమావేశ వేదికపై స్పష్టం చేశారు. శాంతియుతంగా బంగ్లాదేశ్‌తో భారత్ సరిహద్దు సమస్యలను ఎలా పరిష్కరించుకుందో మోదీ ఉదాహరణ కూడా చూపించారు. ఐక్యరాజ్యసమితి కూడా ఆ మార్గంలో ప్రపంచ శాంతికి బాటలు వేయకపోతే… సమితి లక్ష్యాలు మరో వందేళ్లు గడిచినా నెరవేరవు.