Apple: టెక్నాలజీ టాప్ సంస్థ యాపిల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థపై అమెరికా ప్రభుత్వం కోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కారణంగా యాపిల్ సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి. యాపిల్ షేర్లు 4.1 శాతం పడిపోవడంతో, దాదాపు రూ 9.4 లక్షల కోట్ల నష్టం జరిగింది. అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్, 16 రాష్ట్రాల అటార్నీ జనరల్‌లు గురువారం యాపిల్‌పై యాంటీట్రస్ట్ దావా వేశారు. అంటే.. అమెరికా యాంటీ ట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించి, మార్కెట్లో గుత్తాధిపత్యం కోసం యాపిల్ ప్రయత్నిస్తోందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది.
CSK VS RCB: అదే జుట్టు.. అదే జోరు.. పాత ధోని పూనకాలు రిపీట్
ఇతర పోటీ కంపెనీలను దూరంగా ఉంచడం, ధరలను నియంత్రించడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు కూడా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వినియోగదారులు బలవంతంగా యాపిల్ ఉత్పత్తులు మాత్రమే వాడేలా చేస్తూ, ఇతర పోటీ సంస్థల్ని నియంత్రిస్తోందనేది ప్రధాన ఆరోపణ. అంటే వేరే సంస్థల ఉత్పత్తులు, సేవలు యాపిల్ డివైజ్‌లలో వాడే అవకాశం ఉండటం లేదు. పైగా ఇతర సంస్థలకంటే ఎక్కువ చార్జీలు వసూలు చేస్తోంది. థర్డ్ పార్టీ యాప్స్ సపోర్ట్ చేయకపోవడం, ఇతర కంపెనీల స్మార్ట్ డివైజెస్‌కు కనెక్ట్ కాకపోవడం వంటివి యాపిల్ ప్రోడక్ట్స్‌లలో సహజం. దీంతో యాపిల్ వినియోగదారులు ఆ కంపెనీ ఉత్పత్తులు మాత్రమే వాడాలి. ఇలా అనైతిక విధానాలకు పాల్పడుతూ అధిక లాభాలు అర్జిస్తోంది. వేరే కంపెనీలకు అవకాశం ఇవ్వడం లేదు. ఈ విధానాల్ని తప్పుబడుతూ అమెరికా ప్రభుత్వం కోర్టులో కేసు దాఖలు చేసింది.
అమెరికాలోనే కాకుండా.. యూరప్‌లో కూడా యాపిల్‌పై ఇదే తరహా ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆ కంపెనీపై అక్కడ దర్యాప్తు కొనసాగుతోంది. యూరప్ డిజిటల్ మార్కెట్ చట్టానికి లోబడి యాపిల్ పని చేస్తుందా.. లేదా అనే అంశాన్ని యూరప్ పరిశీలిస్తోంది. యాపిల్‌పై ఆరోపణలు ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, తాజా ఆరోపణలపై యాపిల్ ఇంకా స్పందించలేదు. కానీ, షేర్ మార్కెట్లో యాపిల్ పతనం మాత్రం కొనసాగుతోంది.